Tuesday, May 7, 2024

ఆంధ్రప్రభ ఎఫెక్ట్‌.. అక్రమ నిర్మాణాల తొలగింపు

కోట్లాది రూపాయాల రైల్వే స్థ‌లం ఆక్రమణలకు గురైనా సంబంధిత అధికారులు రైల్వే ఆస్తులను పరిరక్షించుకోవడంలో విఫలమయ్యారని అక్టోబర్‌ 1వ తేదీన ఆక్రమణలకు గురైన రైల్వే స్థ‌లంలో అక్రమ నిర్మాణాలపై ఆంధ్ర‌ప్ర‌భ‌లో కథనాన్ని ప్రచురించిన విషయం విధితమే. రైల్వే స్థలాలను ఎవరైనా ఆక్రమించుకుంటే వదిలేది లేదని, ఎంతటివారైనా విడిచిపెట్టేది లేదని, కోట్లాది రూపాయాల రైల్వే స్థ‌లం స్వాధీన పరుచుకోవటానికి తాము ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటామని, అందుకు ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు తొలిగిస్తామన్నట్లుగా రైల్వే అధికారులు శనివారం ఉదయం వారి పని తీరుకు అద్దం పడుతోంది. వివరాల్లోకి వెళ్లితే కృష్ణా జిల్లా విజ‌య‌వాడ ప‌రిధిలోని సత్యనారాయణపురంలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డు నందు గతంలో రైల్వే లైన్‌ ఉండేది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగర నడిబొడ్డులో ఉన్న రైల్వే లైన్‌ తొలగించాలని అప్పట్లో స్థానికుల కోరిక మేరకు రైల్వే అధికారులు యుద్ద ప్రాతిపదికన రైల్వే లైన్‌ తొలిగించారు.

అనంతరం ఈ రైల్వే లైన్‌ ప్రాంతంలో అతి పెద్ద రహదారిని ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్డును అభివృద్ది పరిచారు. అయితే రోడ్డుకు ఇరువైపులా కొంత రైల్వే స్థ‌లం మాత్రం రైల్వే అధికారుల ఆధీనంలోనే ఉంది. సీతన్నపేట జంక్షన్‌ నుండి సంగీత కళాశాల జంక్షన్‌ వరకు ఒక వైపు మాత్రమే రైల్వే స్థ‌లం ఉండటంతో ఈ స్థ‌లాన్ని కొంత మంది ఆక్రమణ‌దారులు ఇష్టానుసారంగా ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు నిర్మించుకున్నారు. అయితే ఈ రైల్వే స్థ‌లం క్రింద రైల్వే క్వార్టర్స్‌ కు త్రాగునీటి సరఫరా చేసే పైప్‌ లైన్‌ ఉండటంతో ఎటువంటి కట్టడాలు కట్టకూడదని గతంలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కానీ గత తెలుగుదేశం పార్టీ హయాంలో కొంత మంది భవన యజమానులు, అప్పటి నేతలతో కలిసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు.

అయితే రైల్వే స్థ‌లంలో అక్రమ కట్టడం నేరమని తెలిసినా రాజకీయ నాయకుల అండదండలు తమకు ఉన్నాయన్నట్టుగా వ్యవహరిస్తూ భవనాలు నిర్మించారు. అయితే ఈ భవనాలకు రాకపోకలు సాగించేందుకు రైల్వే స్థ‌లం వినియోగించరాదని తెలిసి కూడా అప్పటి నగర పాలక సంస్థ అధికారులు భవన యజమానుల వద్ద అందిన కాడికి లంచాల రూపంలో లక్షలాది రూపాయలు దండుకొని ఇష్టానుసారంగా భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు. శనివారం హ‌ఠాత్తుగా వచ్చి భారీ పోలీస్‌ బందోబస్తుతో అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. ఈ విషయం తెలుసుకున్న కొంత మంది భవన యజమానులు అధికారుల వద్దకు వచ్చి తమ నివాసాల నిర్మాణానికి నగర పాలక సంస్థ‌ అధికారులు అనుమతి ఇచ్చారని, అలాంటప్పుడు తమ‌ ఇళ్ళు ఎలా అక్రమంగా నిర్మించుకున్నామో చెప్పాలని అధికారులను నిలదీశారు. కనీసం ముందస్తు సమాచారం లేకుండా అర్ధాంతరంగా వచ్చి కట్టడాలను కూల్చి వేస్తామనడం ఎంతవరకు సమంజసమని అధికారులను ప్రశ్నించారు.

- Advertisement -

దీనిపై స్పందించిన రైల్వే అధికారులు తాము ప్రైవేట్ స్థ‌లాల్లో నిర్మించిన నిర్మాణాల జోలికి వచ్చేది లేదని రైల్వే స్థ‌లంలో ఎవరైతే ఆక్రమించుకున్నారో వాటిని మాత్రమే తొలగిస్తామని ఖరాఖండిగా చెప్పడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తమకు కొంత వ్యవధి ఇవ్వాలని, అప్పటి దాకా కూల్చివేత పనులు ఆపి వేయాలని అధికారులను ప్రాధేయ‌ప‌డ్డారు. అయినా రైల్వే అధికారులు వారి మాటలు వినకుండా రైల్వే స్థ‌లం స్వాధీనం పరుచుకునే పనిలో పడ్డారు. సీతన్న‌పేట జంక్షన్‌ నుండి సంగీత కళాశాల జంక్షన్‌ వరకు రైల్వే అధికారులు ఉదయం 8 గంటల నుండి రాత్రి 6 గంటలకు వరకు ఈ ఆక్రమణలు తొలగించారు. ఈ విషయం పై సంబంధిత రైల్వే అధికారులను వివరణ కోరగా తమ స్థ‌లం ఎక్కడిదాకా ఉందో కొలతలు వేసి స్వాధీన పరుచుకుంటామని, ఆ తర్వాత నిర్మాణాల విషయం ఆలోచిస్తామని వెల్లడించారు. ఏది ఏమైనా కోట్లాది రూపాయల రైల్వే స్థ‌లాన్ని ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని రైల్వే అధికారులు సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement