Wednesday, May 1, 2024

AP Politics | టీడీపీలో అలజడి, మహేష్ యాదవ్ రంగ‌ప్ర‌వేశం.. హాట్​టాపిక్‌గా నరసరావుపేట రాజ‌కీయం

గుంటూరు, ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి: ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో అలజడి ప్రారంభం అయింది. నరసరావుపేట పార్లమెంట్ స్థానం అందుకు కేంద్రబిందువుగా మారింది. పార్టీలో యువనాయకుని గా వున్న పుట్టా మహేష్ యాదవ్ నరసరావుపేట పార్లమెంట్ స్థానంపై కన్ను వేయటం పార్టీ లో హాట్ టాపిక్ గా మారింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన టిటిడి మాజీ చైర్మన్ పుట్టా సుధాకర యాదవ్ కుమారుడు మహేష్ యాదవ్. అంతేగాక టిడిపి పోలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనమండలి లో పార్టీ నాయకునిగా వున్న యనమల రామకృష్ణుడు కు మహేష్ అల్లుడు. దీంతో మహేష్ రంగప్రవేశం గుంటూరు జిల్లా టిడిపి వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి 2019 లో సీనియర్ నాయకుడైన రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు గెలుపొందారు. వయోభారం కారణంగా రాయపాటి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనలేక పోతున్నారు. ఈ నేపథ్యంలోనే నరసరావుపేట స్థానం నుంచి రాయపాటి మరోసారి పోటీ చేయరన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయటం లేదని రాయపాటి ఎక్కడా స్పష్టంగా ప్రకటించలేదు. అయినా ఆశావహులు అందరూ ఎవరి వంతు ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో మహేష్ యాదవ్ రంగప్రవేశం పార్టీ లో చర్చనీయాంశం అయింది. నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి వచ్చే ఎన్నికలలో మహేష్ యాదవ్ పోటీ చేస్తారని ఆ పార్టీలో కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ప్రముఖులు అందరినీ మహేష్ యాదవ్ గత రెండు రోజులుగా వ్యక్తిగతంగా గా కలుస్తున్నారు. వారిని మర్యాదపూర్వకంగానే కలుస్తున్నట్టు మహేష్ చెబుతున్నారు.

- Advertisement -

బిసి సామాజికవర్గానికి చెంది వుండటం, ఆర్థికంగా బలీయమైన వ్యక్తి కావటంతో నరసరావుపేట నుంచి మహేష్ అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం వుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో మహేష్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అత్యధిక సంఖ్యలో వుండటం ఆయనకు కలిసిరాగలదు అని భావిస్తున్నారు.

నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గం లోనూ తెలుగుదేశం పార్టీ కి సీనియర్ నాయకులు వున్నారు. వారిలో నుంచి ఒకరిని వచ్చే ఎన్నికలలో పార్టీ తరపున లోకసభ బరిలోకి దించగలరని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. తాజాగా మహేష్ రంగప్రవేశం రాజకీయ సమీకరణాలు అన్నీ మారిపోయాయి. పల్నాడు జిల్లాలోని టిడిపి నాయకులంతా దీనిపై గుంభనంగా వున్నప్పటికీ, లోలోన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement