Monday, May 6, 2024

Action Plan – రిజ‌ర్వ్ డ్ సీట్ల‌పై తెలుగుదేశం ప్ర‌త్యేక దృష్టి…

అమరావతి, ఆంధ్రప్రభ: రానున్న ఎన్నికల్లో విజయం సాధించా లన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆచి తూచి, అడుగులు వేస్తోంది. గతానికి భిన్నంగా టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త వ్యూహాలతో పార్టీకి జీవం పోసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పరిస్ధితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, పార్టీ నేతల పని తీరును క్షుణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఆయన రిజర్వడ్‌ నియోజకవర్గాలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో మొత్తం 36 రిజర్వుడ్‌ అసెంబ్లి స్థానాలు ఉండగా వాటిలో 29 ఎస్సీ, 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రిజర్వ్‌ స్థానాల్లో మిశ్రమ ఫలితాలను చవిచూస్తూ వస్తోంది. ఇప్పటి వరకు ఈ రిజర్వ్‌ స్థానాల్లో పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించిన పరిస్ధితి లేదు.

గత ఎన్నికల్లో సైతం ఈ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా పట్టును కోల్పోయింది. ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో మళ్ళీ బలపడేందుకు వ్యూహాలను సిద్దం చేస్తూ ఎన్నికల కార్యాచరణను రూపొందిస్తోంది. ముఖ్యంగా గత ఫలితాలను, ప్రస్తుత పరిస్ధుతులను అంచనా వేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి ఎలాగైనా అక్కడ పాగా వేయాలన్న లక్ష్యంతో ప్లాన్లు వేస్తున్నారు. దీనిలో భాగంగా రిజర్వ్‌ నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌ల మార్పుకు శ్రీకారం చుట్టారు. గతంలో ఉన్న ఇన్‌చార్జ్‌ల్లో కొందరినీ కొనసాగిస్తూనే, మరి కొందరికి ఉద్వాసన పలుకుతున్నారు. శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకూ రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌ల పని తీరుపై రహస్య నివేదికలను తెప్పించుకుంటూ తక్షణ నిర్ణయాలకు ఉపక్రమిస్తున్నారు.

తటస్తులకు అవకాశం
రిజర్వడ్‌ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన చంద్రబాబు తటస్తులకు అవకాశం కల్పించే యోచనలో ఉన్నారు. ఆయా వర్గాలతో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తులు, ఉన్నత విద్యావంతులకు అవకాశం కల్పించాలన్న నిర్ణయానికి వచ్చారు. దీనిలో భాగంగానే ఇటీవల గంగాధర నెల్లూరు, పూతలపట్టు, నియోజకవర్గాల ఇంచార్జ్‌ ల నియామకాన్ని చేపట్టారు. ఇదే విధంగా మరి కొన్ని రిజర్వడ్‌ స్థానాల్లో ఇన్‌చార్జ్‌ల మార్పుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుండి ఆయా నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా లేని నేతలకు ఈసారి టిక్కెట్లు ఇవ్వకూడదని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యావంతులైన దళిత, గిరిజన యువకులకు టిక్కెట్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. మొత్తం 36 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్దితి ఏ విధంగా ఉందో తెలుసుకుంటున్న చంద్రబాబు దీనికి సంబంధించిన నివేదికలను తెప్పించుకోవటమే కాకుండా మరోవైపు రాబిన్‌ టీమ్‌ చేసిన సర్వే ఫలితాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ అధిష్టానానికి రిజర్వడ్‌ నియోజకవర్గాలకు సంబంధించి కొందరు ఆశావహులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. వీరిలో ఉన్నతస్ధాయి అధికారులు కూడా టికెట్ల కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దరఖాస్తులన్నిటినీ స్వయంగా పార్టీ అధినేత పరిశీలిస్తూ ఎన్నికల కార్యాచరణను సిద్దం చేస్తున్నారు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి త్వరలోనే ఒక సమావేశాన్ని నిర్వహించి అవసరమైన నిర్ణయాలు తీసుకునే దిశగా అధిష్టానం ఆలోచన చేస్తోంది. ఈసారి ఎలాగైనా రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement