Friday, May 10, 2024

త్వరలో 666 ఎంఈవో పోస్టులు భర్తీ.. మంత్రి ఆదిమూలపు సురేష్‌

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా 666 ఎంఈవో పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. శుక్రవారం శాసనమండలి ప్రశ్నోత్తరాలలో పీడీఎఫ్‌ సభ్యులు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 264 ఎంఈవో పోస్టుల ఖాళీలను గుర్తించడం జరిగిందన్నారు. అలాగే వీటికి అదనంగా మరో 402 పోస్టులను కూడా భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్‌ ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని మంత్రి వెల్లడించారు. అలాగే క్రాప్ట్‌, డ్రాయింగ్‌ టీచర్‌ పోస్టుల అవసరం మేరకు నియామకాలు చేపడతామని చెప్పారు. ఈ సందర్భంగా పీడీఎఫ్‌ పక్షనేత విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉండటంతో పరిపాలన కుంటుపడుతుందని తెలిపారు. ఖాళీగా ఉన్న డిప్యూటీ డీఈవో పోస్టులను కూడా భర్తీ చేయాలని సూచించారు.

సర్వీస్‌ రూల్స్‌కు సంబంధించి ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ పదోన్నతులు సర్వీస్‌ రూల్స్‌ రూపొందించి వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సర్వీస్‌ రూల్స్‌ అంశం కోర్టుల్లో పెండింగ్‌లో ఉందని, వారంలో రెండు, మూడు రోజుల పాటు అధికారులు కోర్టులకు హాజరు అయ్యే పరిస్థితి ఉందని, మంత్రి తెలిపారు. ఈ నెల చివరిలో కోర్టు వాయిదా ఉందని దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని సభ్యులకు హామీ ఇచ్చారు. ఎంఈవోలకు సెల్ఫ్‌ డ్రాయింగ్‌ పవర్స్‌ ఇవ్వాలని వై. శ్రీనివాసులురెడ్డి ప్రభుత్వాన్ని సూచించారు. వీటన్నింటిపై మంత్రి మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న పోస్టులను ఇప్పుడు భర్తీ చేస్తున్నామని, అలాగే సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌కు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో స్వీపర్‌ పోస్టులను ఆయా పోస్టులుగా మార్చామని, వీరందరి వేతన బకాయిలు చెల్లించడం జరిగిందన్నారు. బోధనేతర సిబ్బంది నియామకం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. వాచ్‌మెన్‌, కంప్యూటర్‌ టీచర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను అవసరాలకు అనుగుణంగా భర్తీ చేస్తామని చెప్పారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయాను నియమించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 975 జూనియర్‌ కళాశాలల్లో సైతం ఆయాను నియమించి టాయిలెట్స్‌ మెయిన్‌టనెన్స్‌ చేస్తున్నామని చెప్పారు. కొన్ని పాఠశాలల్లో అవసరానికి మించి బోధనేతర సిబ్బంది ఉన్నారని, వీరిని సిబ్బంది లేని చోట సర్దుబాటు చేయాలని విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రభుత్వానికి సూచించారు. నూతన విద్యా విధానం అమలులో భాగంగా సిబ్బంది సర్దుబాట్లను చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement