Thursday, May 16, 2024

పొగడ్తలు.. తెగడ్తలు.. అగడ్తలు

”అన్య కీర్తనంబు, నన్యనిందయు, తన్ను
పర పొగడికోలు, ప్రచ్చికోలు
ఆపగా తనూజ ఆర్యవృత్తములు కా!
వనిరి వీని నాద్యులైన మునులు!”
అని ఆంధ్ర మహాభారతం సభా పర్వంలో చెప్పబడింది. ఇతరులను అన వసరంగా పొగడడం లేదా దూషించడం, అలాగే తనను తాను అతి గా పొగడుకోవడం లేదా విమర్శించుకోవడం మర్యాద కలిగిన వారు చేసే పనులు కావు అని ఈ పద్య భావం.
జీవన విధానంలో మనిషి చక్కని నడవడితో సమాజంలో ఉన్నత స్థానం సంపాదించడము, నలుగురిలో మంచివాడని అనిపించుకోవడం చాలా అవ సరం. మన చుట్టూ ఉన్న పరిసరాలకు, మనుషులకు అనుగుణంగా జీవిస్తూ, జీవితపు విలువలను తెలుసు కొంటూ, వాటిని నిలుపుకొంటూ, జీవన యానాన్ని సాఫీగా సాగించాలి. ఎక్కడైనా, ఎవరిలోనైనా ప్రశం సించదగిన విషయం ఉంటే తప్పక మెచ్చుకోవాలి. అయితే అది మన మనస్సులోంచి రావాలి.
మన హృదయ నైర్మల్యాన్ని, సుహృత్‌ భావాన్ని సూచించేలా ఉండాలి. అంతేకాని గోరంతలు కొండం తలుగా చేసి ఎదుటి వారిని ఆకాశానికి ఎత్తేయడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మంచి గుణాన్ని ప్రశంసిం చడం వలన ఎదుటివారి మనసును గెలుచుకోగలుగు తాము. కానీ వారినుండి ఏదో ఆశించి ఊరక ఉబ్బేయ డం మనలను సంఘంలో చులకన చేస్తుంది. కాకా పడుతున్నామనే భావన కలుగుతుంది. కనుక అతిగా చేయబడే అన్యకీర్తనము మంచిది కాదు.
అలాగే కొందరు అనవసరంగా ఇతరులను విమర్శిస్తూ ఉంటారు. వాళ్ల లో తప్పులను వెదికి మరీ నిందించడానికి సిద్దంగా ఉంటారు. ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడటం ద్వారా తమ గొప్పదనం అందరివద్దా ప్రదర్శించుకో వచ్చని ఈ మార్గం ఎంచుకుంటారు. ఇది చాలా తప్పు. తెలివైన వాళ్లెవరూ అలా ప్రవర్తించరు. ఆకాశంపైకి ఉమ్మి వేస్తే అది తిరిగి మనపైనే పడుతుందనే ఎరుక కలిగి ఉండాలి. మనలను మనం పొగడుకోవడం ఆత్మహత్యతో సమా నమైతే ఇతరులను నిందించడం వారిని హత్య చేసిన దానితో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇందుకు మహాభారతంలోని కర్ణపర్వంలోగల ఒక సంఘటనను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అభిమన్యుని వధ అనంతరం ఒక రోజు జరిగిన యుద్ధంలో ఆనాటి కురు సేనాని అయిన కర్ణుడు తన పరాక్రమాన్నంతా ప్రదర్శించి పాండవులను నిర్వీ ర్యులను చేస్తాడు. అతని బాణములతోనూ వాటికన్నా పదునైన పరిహాసపు మాటలతోను అవమానింపబడి, కోపంతో రగిలిపోతున్న ధర్మరాజు నాటి రాత్రి తనను చూడవచ్చిన అర్జునుని, అతని పరాక్రమాన్ని, ముఖ్యంగా అతని ధనస్సు అయిన గాండీవాన్ని నిందింస్తాడు. గాండీవాన్ని విమర్శించిన వారిని చంపుతానని గతంలో తాను ప్రతిజ్ఞ చేసి ఉన్నందువలన, ధర్మరాజును అర్జు నుడు చంపబోతాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు అర్జునుని వారించి ”గురుని కీడా డుటయ వధించుటగుట చేసి” అని పెద్దలను తూలనాడుట వారిని వధించు టతో సమానమని శాస్త్ర ప్రమాణమున్నది కనుక ధర్మరాజుని నిందించమని ప్రోత్సహిస్తాడు. అర్జునుడు అట్లు చేసి పె ద్దలను నిందించినందుకు ప్రాయశ్చి త్తంగా కత్తితో తన తల కోసుకునేందుకు సిద్దపడతాడు. అప్పుడు మరల శ్రీ కృష్ణుడు ”ఆత్మ ప్రశంసనీయము. అది మరణంబని పెద్దలు చెప్పుదురు” అని ఆత్మస్తుతికి అర్జునుని ప్రోత్సహిస్తాడు. అలా ఆ అన్నదమ్ములను గండం నుంచి గట్టెక్కిస్తాడు. ఇతరులలో నెపములు వెదకడం అన్నది కపటపు దుర్జా తి లక్షణమని సుమతీశతకం చెబుతూ అటువంటి వారితో కూడి ఉండరాదని బోధించింది. ఇతరులలో తప్పులు వెతకటం ఎంత తప్పో మరొక చాటు పద్యంలో ఇలా చెప్పింది. ” నక్కలు బొక్కలు వెదుకును అక్కరతో నూర పంది ఆగడిత వెదు కున్‌ కుక్కలు చెప్పులు వెదుకును తక్కువ వాడెలయప్పడు తప్పలె వెదకున్‌” అగడ్త అంటే బురద గుంట, కందకము అని అర్థాలున్నాయి. ” ఎప్పుడు తప్పు లు వెదకెడు నప్పురుషుని కొల్వకూడదని” అంటుంది సుమతీ శతకం. అనవ సరంగా పరులను నిందించడమూ తప్పే. అలాగే తప్పు నిజంగా చేస్తున్న వారిని సరిదిద్దక ఉపేక్షించడమూ తప్పే. దుర్యోధనుని తప్పుడు పనులను భీష్మాదులు తీవ్రంగా ప్రతిఘటించక ఉపేక్ష చేసినందువలన వారితో బాటు కురువంశమే నశించిపోయింది. ఈ విషయాన్ని ముందుగానే రాయబారం సందర్భంలో శ్రీకృష్ణుడే స్వయంగా హెచ్చరించాడు. ఆ పద్య మిది. ”సారపు ధర్మమున్‌, విమల సత్యము, పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడ బారిన దైనయవస్థ, దక్షులె వ్వారలు పేక్ష చేసిరది వారల చేటగు గాని ధర్మని స్తారకమయ్యు సత్య శుభ దాయకమయ్యునుదైవముండెడున్‌” సారమైన ధర్మము పాపం చేత, నిర్మలమైన సత్యము అసత్యం చేత అణచి వేయబడుతున్న పరిస్థితిని చక్కదిద్ద గల సమర్దత కలిగిన వారు ఉపేక్ష చేస్తే అది వారికే చేటుచేస్తుంది. కానీ, సత్య ధర్మాలను రక్షించడానికి భగవంతుడనేవాడు ఎప్పు డూ ఉంటాడు అని భావం. కనుక పిల్లల యొక్క తోటి వారల యొక్క తప్పులను సరిదిద్దడానికి ధర్మం తెలిసిన వారు ఎప్పుడూ వెనుకాడరాదు. వాళ్లు ఏమనుకొంటారో, బాధపడుతారో ఏమో అని మొహమాట పడరాదు. ఇక తనను తాను పొగడుకోవటం. దీనినే ఆత్మ స్తుతి అంటాము. ఇది కూడా తప్పే. మనం చేసే పనులను లోకులు పొగిడితే అది గొప్ప కానీ, మనలను మనమే పొగడుకోవడం అనేది మన కాళ్లను మనమే మొక్కుకుని ఆశీర్వ దించుకోవడం లాగా పరిహాస పాత్ర అవుతుంది. మనలను మనమే కాదు, మన పిల్లలను, కుటుంబసభ్యులను కూడా మనం పొగడరాదు. అది వారికి అహంకారం కలిగించడమే కాక, వారి అభివృద్దికి నిరోధకం కూడా అవుతుంది. భారవి కవి కథ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. జనులాపుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహం పొందాలి. కానీ తండ్రే స్వయంగా తన పిల్ల లను పొగడరాదని సుమతీశతకారుని ఉద్బోధ. ఎవరిని ఎప్పుడు పొగడాలో పెద్దలు చెప్పే ఉన్నారు.
చివరిది ఆత్మ నింద. అంటే మనలను మనమే నిందించుకోవటం. చిన్న చిన్న పొరబాట్లకు కృంగిపోయి మనలను మనమే నిందించుకుంటూ ఉండ డం కూడా తప్పే. వైఫల్యాలు అందరి జీవితాలలో సాధారణమే. అలాంటి సందర్బాలలో ఆత్మనూన్యతతో తనను తాను నిందించుకోవటం స్థయిర్యం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడడం వివేకవంతుల లక్షణంకాదు. సాను కూల భావనలను అంతశ్చేతనకు పంపు తూ పట్టుదలతో విజయానికి ప్రయత్నించటమే ధీరుల లక్షణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement