Sunday, May 19, 2024

Delhi | జగన్‌కు నిజాయితీ ఉంటే 100 సార్లు రాజీనామా చేయాలి : కనకమేడల

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అక్రమాల కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కోర్టులో సరైన సాక్ష్యాలు సమర్పించలేకపోయారని తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. న్యాయస్థానాలను గౌరవించే సంస్కృతి వైఎస్సార్సీపీ నేతలకు లేదని, అందుకే ఇష్టారాజ్యంగా కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు.

వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితంగా, న్యాయస్థానాన్ని అవమానించేలా ఉన్నాయని ఆరోపించారు. సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతోనే హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇస్తే.. సాక్ష్యాధారాలన్నీ కోర్టు సమర్పించామని సజ్జల వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. కోర్టుల నుంచి 200 కంటే ఎక్కువ సార్లు మొట్టికాయలు పడి వైఎస్సార్సీపీ నేతల శరీరాలు మొద్దుబారిపోయాయని ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి నిజాయితీ ఉంటే వంద సార్లు రాజీనామా చేయాల్సి ఉంటుందని కనకమేడల అన్నారు.

చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసు పెట్టి విష ప్రచారం చేశారన్న సంగతి అందరికీ తెలుసని ఆయనన్నారు. కేసు నమోదు చేసిన రెండేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడును అందులో చేర్చారని గుర్తుచేశారు.చంద్రబాబు కేసు గురించి మాట్లాడే ముందు సజ్జల 22 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలని సూచించారు. జగన్‌పై కేసులు నమోదు చేసింది సీబీఐ అని, చంద్రబాబు నాయుడు కాదన్న సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు.

రూ. 43 వేల కోట్ల ప్రజాధనాన్ని జగన్ దోచేశారని ఆరోపించారు. తన సీఎం పదవిని అడ్డం పెట్టుకుని కోర్టు విచారణకు హాజరుకాకుండా పదవిని దుర్వినియోగపరుస్తున్నారని దుయ్యబట్టారు. రూ. 370 కోట్లకు చంద్రబాబు జైలుకు వెళ్తే.. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లాలి అంటూ ప్రశ్నించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఈ కేసులో ఇప్పటి వరకు పాత్రధారులు మాత్రమే బయటికొచ్చారని, సూత్రధారులు ఇంకా రాలేదని కనకమేడల అన్నారు.

ముందు ఈ కేసులో వైఎస్సార్సీపీ నేతలు నిర్దోషులుగా బయటకు వచ్చి ఆ తర్వాత చంద్రబాబు కేసు గురించి మాట్లాడాలని హితవు పలికారు. మరోవైపు చంద్రబాబుకు మంజూరైన రెగ్యులర్ బెయిల్ నేపథ్యంలో ఈ నెల 29 నుంచి ఆయనపై ఎలాంటి షరతులు వర్తించవని తెలిపారు. ఏపీలో వైఎస్సార్సీపీ పాలన గురించి తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు రోజూ చేస్తున్న విమర్శలు చూస్తేనే అర్థమవుతుందని కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement