Wednesday, May 8, 2024

తెలంగాణలో భారత్ జోడో యాత్ర.. మార్గం ఖరారు చేసిన అధిష్టానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ రూట్ మ్యాప్ ఖరారైంది. మక్తల్ వద్ద యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించి జుక్కల్ మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్తుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో భారత్ జోడో యాత్రపై జరిగిన సమీక్షలో పాల్గొన్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని కులాలు, మతాలు, ప్రాంతాల ప్రాతిపదికన ముక్కలుగా విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. అనేక రాష్ట్రాల్లో దళితులు, గిరిజనులు సహా వివిధ వర్గాలపై జరుగుతున్న దాడులను ఎత్తిచూపేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి వివరించారు. దాదాపు 150 రోజులపాటు 3,600 కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగనుందని తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణలో యాత్రను అద్భుతంగా నిర్వహిస్తామని రేవంత్ అన్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు సహా అన్ని అనుబంధ విభాగాలను యాత్రలో భాగస్వాములను చేస్తామని చెప్పారు. దేశాన్ని కులమతాల పేరుతో విడగొట్టాలని చూస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యం చేయడమే ఈ యాత్ర ముఖ్యోద్దేశమని వివరించారు.

జులై 22న ఏపీలో అన్ని జిల్లాల్లో నిరసన..
భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల సమీక్షకు హాజరైన ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్, ఆంధ్రప్రదేశ్ మీదుగా సాగే ఈ యాత్ర కోసం ఏర్పాట్లు చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే జులై 22న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారణకు పిలవడాన్ని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు చెప్పారు. ఈ మేరకు 21న విజయవాడకు తరలిరావాల్సిందిగా కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజాస్వామ్యవాదులందరికీ పిలుపునిస్తున్నట్టు శైలజానాథ్ ప్రకటించారు. మరోవైపు సీఎం జగన్‌ను తక్షణమే వరద సహాయచర్యల్లో పాల్గొనాలని డిమాండ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement