Tuesday, May 14, 2024

Delhi | చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంలో సవాల్.. పిటిషన్ దాఖలు చేసిన ఏపీ సీఐడీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో నిందితులుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (ఏపీ సీఐడీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చంద్రబాబుకు బెయిల్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మరికొందరు న్యాయవాదులు, ఏపీ సీఐడీ అధికారులతో కలిసి అర్థరాత్రి ఢిల్లీ చేరుకున్నారు.

సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము సమర్పించిన సాక్ష్యాధారాలను, వాదనలను పరిగణలోకి తీసుకోకుండా న్యాయస్థానం తీర్పునిచ్చిందని వ్యాఖ్యానించారు. ఆ తీర్పు చట్ట సమ్మతం కాదని అన్నారు. తాము ఆధారాలు సమర్పించినా సరే.. సరైన ఆధారాలు లేవంటూ తీర్పులో పేర్కొనడం దారుణమని అన్నారు.

- Advertisement -

ఇదే కేసులో క్వాష్ పిటిషన్‌తో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ ముగించి తీర్పును రిజర్వ్ చేసిందని, ఇలాంటప్పుడు హైకోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపడం సరికాదంటూ తాము అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోలేదని, కనీసం తీర్పులోనూ ఈ అంశాలను ప్రస్తావించలేదని పొన్నవోలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మినీ ట్రయల్ నిర్వహించరాదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సైతం బేఖాతరు చేస్తూ ఏపీ హైకోర్టు వ్యవహరించిందని అన్నారు.

ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకునే అధికారం ఉందంటూ హైకోర్టు తీర్పులో పేర్కొందని, కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నదే తమ వాదన అయినప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. తనకు లేదా తనవాళ్లకు లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నప్పుడే అవినీతి నిరోధక చట్టం తెరపైకి వస్తుందని, ఈ అంశాన్ని హైకోర్టు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. మొత్తంగా హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రూ. 371 కోట్లు చేతులు మారిన విషయంలో తాము సీమెన్స్ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టుతో పాటు కోనర్ రిపోర్టు, ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టు కూడా హైకోర్టుకు సమర్పించామని, వాటి ప్రకారం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి డిజైన్‌టెక్ సంస్థ ద్వారా వివిధ షెల్ కంపెనీలకు నగదు బదిలీ జరిగిందని, ఆ తర్వాత ఆ సొమ్ము హైదరాబాద్ చేరుకుందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. సరిగ్గా అదే సమయంలో రోజుకు కొంత చొప్పు తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి ఊరూ, పేరు లేని వ్యక్తుల పేరిట నగదు జమైందని అన్నారు.

ఇంత మొత్తంలో ప్రజాధనాన్ని దోచేశారని ఆయన ఆరోపించారు. ఇది సాధారణ ఐపీసీ నేరం కాదని, ప్రజాధనంతో ముడిపడ్డ ఆర్థిక నేరం అని.. దీన్ని అత్యంత ప్రత్యేక కేసుగా పరిగణించాలని పొన్నవోలు వ్యాఖ్యానించారు. ఆయన అరెస్ట్ కాకముందు నుంచే సాక్షులను ప్రభావితం చేశారని, పీఏ శ్రీనివాస్ విదేశాలకు వెళ్లడం, ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన ఆడిటర్‌పై ఫిర్యాదులు చేయడం సహా అనేకరకాలుగా దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరించారని చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేశారు.

వయస్సు, అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వాలనుకుంటే 73 ఏళ్లు దాటిన అందరి కోసం సీఆర్పీసీ చట్టాన్ని సవరిస్తే గొడవే ఉండదని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నప్పుడు చంద్రబాబుకు మాత్రమే ప్రత్యేక సెల్, ఏసీ వంటి సదుపాయాలు ఎందుకు ఇచ్చారని, ఇస్తే అందరికీ ఇవ్వాలి కదా అని పొన్నవోలు వ్యాఖ్యానించారు. చివరగా తాను న్యాయమూర్తులను తప్పుబట్టడం లేదా దురుద్దేశాలను ఆపాదించడం చేయడం లేదని, కేవలం తీర్పును మాత్రమే తప్పుబడుతున్నానని అన్నారు. తీర్పును తప్పుబట్టి పై కోర్టులను ఆశ్రయించే అధికారం, హక్కు తనకు ఉన్నాయని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement