Friday, May 3, 2024

ఉన్న‌త విద్య కోసం హైద‌రాబాద్ బాట ప‌డుతున్న యువ‌త‌…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: డిగ్రీ ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌ నగరానికి వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లాల్లో సరైనా విద్యాప్రమాణాలు కల్గిన కళాశాలలు లేకపోవడంతో అక్కడ ఉన్నత విద్యను అభ్యసించడం కంటే హైదరాబాద్‌ మహానగరంలోని కాలేజీల్లో చదివేందుకే విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇంటర్‌ పాసైన తర్వాత డిగ్రీలో చేరాలనుకునే వారు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని కాలేజీల్లో చేరుతున్నారు. ఇలా ఇంటర్‌ తర్వాత విద్యకోసం రాష్ట్రంలోని 30 జిల్లాల నుంచి హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండటంతోపాటు, మంచి విద్యాప్రమాణాలు కల్గిన కళాశాలలు ఎక్కువగా ఉండడంతో సిటీకు కేంద్రంగా ఉండే హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని డిగ్రీ కాలేజీల్లో చదువుకునేందుకు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు.

ఓవైపు డిగ్రీ చుదువుతూనే మెరుగైనా ఉద్యోగవకాశాలకు సహాయపడే కోర్సులు కూడా హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో అందుబాటులో ఉండడాన్ని విద్యార్థులు ప్రయోజనకంగా చూస్తున్నారు. అందుకే డిగ్రీ పట్టా కోసం జిల్లాల నుంచి ఇక్కడికి తరలివస్తున్నారు. గతేడాది 2022లో హైదరాబాద్‌ జిల్లాల్లో మొత్తం 174 డిగ్రీ కాలేజీలుంటే, అందులో 83,767 సీట్లకు 51,346 సీట్లు భర్తీ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 104 డిగ్రీ కాలేజీల్లోని 32,490 సీట్లకు 16,664 సీట్లు, మేడ్చల్‌ జిల్లాలోని 84 కాలేజీల్లోని 27,482 సీట్లకు 13,905 సీట్లు భర్తీ అయ్యాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలు మినహా మిగతా 30 జిల్లాల్లోని మొత్తం 692 కాలేజీల్లో 2,41,834 సీట్లకు గానూ 1,30,273 సీట్లు భర్తీ అయ్యాయి. దోస్త్‌, రెసిడెన్షియల్‌, నాన్‌ దోస్త్‌ డిగ్రీ కాలేజీలు కలుపుకొని మొత్తం రాష్ట్రంలో 1054 కాలేజీల్లో 3,85,573 సీట్లుంటే అందులో 2,21,188 సీట్లు గతేడాదిలో నిండాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఈ మూడు జిల్లాల్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ కాలేజీల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement