Sunday, April 28, 2024

Weather Report – కూల్ కూల్! పులకించిన పుడమి తల్లి

ఉక్క పోత నుంచి ఊరట
ఉరుములు మెరుపుల వర్షాలతో.
చల్లబడ్డ వాతావరణం..
ఆదిలాబాద్​ జిల్లాలో మోస్తరు జల్లులు
మరో మూడు రోజులపాటు వానలే
హెచ్చరించిన వాతావరణశాఖ

ఆంధ్ర‌ప్ర‌భ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్: నిప్పుల కొలిమిలా మండుతున్న ఎండలతో అల్లాడుతున్న జనాలకు ఊరట లభించింది. అల్పపీడన ద్రోణి ఆవర్తనం మహారాష్ట్రలో కేంద్రీకృతం కావడంతో మంగళవారం రాత్రి, బుధవారం వేకువజామున ఉరుములు మెరుపులతో ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కురిశాయి. వేసవి తాపానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న జిల్లా ప్రజలు ఊరట చెందారు. ఆదిలాబాద్, మంచిర్యాల సింగరేణి కోల్‌బెల్ట్‌, ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

ఉష్ణోగ్ర‌త‌ల నుంచి ఊర‌ట‌..

నిన్న మొన్నటి దాకా ఆదిలాబాద్ జిల్లాలో 44.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా, బుధవారం కురిసిన వర్షానికి ఒకేసారి ఏడు నుంచి ఎనిమిది డిగ్రీలు తగ్గి వాతావరణం చల్లబడింది. ఆదిలాబాద్ రూరల్, నార్నూర్, గాదిగూడ మండలాల్లో మోస్తరు వర్షాలు కురిసాయి. మొక్కజొన్న, జొన్న పంటలు గాలివానతో నేలవాలాయి.

ఆదిలాబాద్ పట్టణంలో 2.3 సెంటీమీటర్ల వర్షం

- Advertisement -

ఆదిలాబాద్ పట్టణంలో వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా ఉంది. జిల్లా కేంద్రంలో 2.3 సెం.మీ. వర్షపాతం, గాదిగుడాలో 1.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇచ్చోడ నేరడిగొండ, బజార్హత్నూర్ గుడియాత్నూర్, నిర్మల్ జిల్లా ఎడిబిడ్ , సిర్పూర్ టి లో అకాల వర్షాల ప్రభావంగా బుధవారం పగటి ఉష్ణోగ్రత 35 నుంచి 37 డిగ్రీలకు చేరాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఉష్ణోగ్రతల్లో మార్పు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మొత్తానికి భానుడి భగభగలతో అల్లాడుతున్న జనం చల్లబడ్డ వాతావరణంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement