Sunday, May 19, 2024

తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం.. ఏప్రిల్ 14 నుంచి పాదయాత్ర: ఆప్​ నేతలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఏప్రిల్ 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని నిర్ణయించినట్టు ఆప్ సెర్చ్ కమిటీ ఛైర్‌పర్సన్ ఇందిరా శోభన్ వెల్లడించారు. ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే, దక్షిణాది రాష్ట్రాల ఇంఛార్జి సోమ్‌నాథ్ భారతితో కలిసి శుక్రవారం ఆమె ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పంజాబ్ గెలుపుతో తమ పార్టీలో నూతనోత్సాహం వచ్చిందని, కేజ్రీవాల్ నేతృత్వంలో భారీ మెజారిటీ సాధించగలిగామని సోమ్‌నాథ్ అన్నారు. ధర్మం, జాతి పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలకు ఇది గుణపాఠమని నొక్కి చెప్పారు. దేశవ్యాప్తంగా తమ పార్టీకి ఆదరణ పెరుగుతుండడంతో దక్షిణ భారతదేశం నుంచి వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయని ఆయన తెలిపారు. పంజాబ్‌లో ఉన్న పరిస్థితులు తెలంగాణాలోనూ ఉన్నాయని, అక్కడ తమ పార్టీని విస్తరించాలని భావిస్తున్నట్టు ఇందిరా శోభన్ వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, పంజాబ్‌లో ఆప్ గెలిచిన తర్వాత అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

2014 ఎన్నికల హామీలో దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ తర్వాత మాట తప్పారని, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని మరిచారని ఆమె విమర్శించారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని ఆమె తెలిపారు. 80 వేల ఉద్యోగాలిస్తానని ప్రకటించిన కేసీఆర్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారనేది మాత్రం ఇంతవరకు చెప్పలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ను దుర్వినియోగం చేయడంలో కేసీఆర్ పీహెచ్డీ చేశారన్న ఆమె… ఎడ్యుకేషన్, హెల్త్ పాలసీల్లో ఢిల్లీ నంబర్ వన్ స్థానంలో ఉందని వివరించారు. తెలంగాణలో మాత్రం ఎడ్యుకేషన్, హెల్త్ పాలసీ అనేదే లేదని విమర్శించారు. 7,651 ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యపై చర్చించడానికి కేంద్రమంత్రిని అపాయింట్‌మెంట్ అడిగామని, వారికి న్యాయం జరిగే వరకూ ఆప్ అండగా ఉంటుందని ఇందిరా శోభన్ స్పష్టం చేశారు. కేసీఆర్ రైతులకు అన్యాయం చేస్తున్నారని, అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో సేవలందించిన ఆరు వందల మందికి పైగా డాక్టర్లను తీసివేయాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని, తాము వారికి మద్దతుగా పోరాడతామని నొక్కి చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement