Sunday, April 28, 2024

బిల్ట్ కార్మికుల నిరాహార దీక్ష

మంగపేట, ( ప్రభ న్యూస్ ) : తమ సమస్యలు పరిష్కరించాలని, తమకు రావలసిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం బిల్ట్ కార్మికులు మంగళవారం బిల్ట్ మెయిన్ గేట్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ 2014 ఏప్రిల్ 5న బిల్ట్ కర్మాగారంలో ఉత్పత్తి నిలిపివేసిన నాటి నుండి బిల్ట్ యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ కార్మికుల సంక్షేమం గురించి, కార్మికుల సమస్యలను పరిష్కరించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్సీఎల్టీ కోర్టు తీర్పు రీ సొల్యూషన్ ప్రొఫెషన్ ( ఆర్ పి ) కి 69 కోట్లు, బల్ట్ కార్మికులకు 6 కోట్లు చెల్లించాలని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంపై ఎన్సీఎల్టీ కోర్టు పునః సమీక్షించాలని డిమాండ్ చేశారు.

బిల్ట్ కార్మికులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న 52 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని, 64 నెలల పెండింగ్ పిఎఫ్ ( భవిష్య నిధి జమ చేయాలని ) చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యువిటీ చట్ట ప్రకారం చెల్లించాలని, బిల్ట్ కాలనీకి విద్యుత్ సరఫరా ఇప్పించాలని, పిఎఫ్ కార్మికులకు ఫుల్ సెటిల్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బిల్ట్ కర్మాగారంకు ఇస్తానన్న 327 కోట్లు కార్మికులకు ఇచ్చి ఆదుకోవాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిల్ట్ కార్మికులు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ అయిన కార్మికులకు సెటిల్మెంట్ చేయాలని, వారికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బిల్ట్ కార్మికుల సమస్యపై చీమ కుట్టినట్లు కూడా లేదని, అన్ని పార్టీల నాయకులు కూడా బిల్ట్ కార్మికులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీల నాయకులు కూడా బిల్ట్ కార్మికులను, బిల్ట్ కార్మిక కుటుంబాలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారని, ఎన్నికల సమయంలో మాత్రమే వారికి బిల్ట్ కార్మికులు గుర్తుకొస్తున్నారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement