Friday, May 10, 2024

ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన కేంద్ర బృందం..

భూపాలపల్లి ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, దెబ్బతిన్న ఇళ్లు, రహదారులతో పాటు వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు నలుగురు సభ్యుల కేంద్ర బృందం గురువారం జిల్లాలో వరద ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటిస్తుంది. మొదట జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్ లోని జెన్ కో గెస్ట్ హౌస్ చేరుకున్నారు. జెన్ కో గెస్ట్‌ హౌస్‌లో వరదల కారణంగా దెబ్బతిన్న, నష్టపోయిన వివరాలను కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్ర‌జెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్‌ భవేష్ మిశ్రా వివరించారు.

గోదావరి నదికి ఇంత పెద్ద ఎత్తున వరదలు రావడం ఇదే తొలిసారి అని అన్నారు. ఈ నెల 10,11 తేదీలలో అసాధారణ రీతిలో, మహాముత్తారం మండలంలో వర్షం కురిసింది అని అన్నారు. జిల్లాలో పలిమేల, మహాదేవ్ పూర్, మహా ముత్తరం, కాటారం, మలహార్ రావు, భూపాలపల్లి మండలాలు వరదల వల్ల తీవ్రంగా నష్ట పోయాయని వారికీ వివరించారు. వరదలు వల్ల ఎటువంటి మానవ నష్టం జరగలేదని అన్నారు. 251 జంతువులు చనిపోయాయని తెలిపారు. ఎన్డీఆర్ ఎఫ్ సహాయంతో వరద ప్రభావిత గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టి నట్లు కలెక్టర్‌ కేంద్ర బందానికి వివరించారు. అనంతరం జిల్లాలోని మహాముత్తారం మండలం దౌత్ పల్లి గ్రామంలో 75 మంది రైతులు 110 ఎకరాలలో పత్తి చేలలో ఇసుక మెటల్ పేరుకుపోయి పంట నష్టం వాటిలిందని రైతులు కేంద్ర బృందానికి మొర పెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement