Sunday, April 28, 2024

డబుల్ బెడ్రూమ్ హక్కుపత్రాలు అందజేసిన ఎమ్మెల్యే గండ్ర.. కేసీఆర్ నగర్ గా నామకరణం

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేశాలపల్లిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 554 రెండు పడకల ఇళ్ల పట్టాల హక్కు పత్రాలను బుధవారం స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హల్ లో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ ఏరియాకు కేసీఆర్ నగర్ గా నామకరణం చేశారు. ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ… ఇంటి హక్కు పత్రాలు పొందిన లబ్ధిదారులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక కల అని, అలాంటి కలను మన ముందు ఉంచిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

భూపాలపల్లి పట్టణాల్లో నలుమూలల నుంచి ఎంతో మంది జీవనోపాధి కోసం వచ్చి నివసిస్తున్న వారికి ఎలాంటి విభేదాలు లేకుండా నిజమైన అర్హులకు ఇండ్లు అందించడం జరిగిందన్నారు. ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడంతో పాటు ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు స్థానికంగా నీళ్ల సమస్యల పరిష్కారం కోసం రూ.50లక్షల నిధులను కేటాయించారన్నారు. పట్టాలు పొందిన ప్రతి ఒక్కరూ కరెంట్ కనెక్షన్ లు తీసుకుని ఇళ్లలో ఉండాలని సూచించారు. భూపాలపల్లి డబుల్ బెడ్ రూమ్ ల ఎంపికలో పారదర్శకంగా అర్హులను స్థానిక కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో పనిచేశారన్నారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం పనులు కూడా తుదిదశకు చేరాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకట రాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్, స్థానిక కౌన్సిలర్ బానోతు రజిత, కౌన్సిలర్లు, అధికారులు, పార్టీ నాయకులు, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement