Monday, April 29, 2024

కనీవినీ ఎరుగని రీతిలో ద‌శాబ్ది ఉత్సవాలను నిర్వహించాలి : మంత్రి ఎర్రబెల్లి

హైద‌రాబాద్‌ : రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్సవాల‌ను కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. ముఖ్యంగా పల్లెల్లో పండుగ వాతావరణంలో జరిపి శాఖల ఉన్నతిని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహ‌ణ‌పై శుక్రవారం బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ముఖ్య కార్యద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సంబంధిత శాఖల ఉన్నతాధికారుల‌తో మంత్రి స‌మీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరిచిపోలేని విధంగా పల్లెల్లో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. జూన్ 2వ తేది నుంచి 23వ తేదీ వ‌ర‌కు రోజుకో కార్యక్రమం చొప్పున 21 రోజుల పాటు అత్యంత వైభ‌వంగా నిర్వహించాలన్నారు. ప‌ల్లె ప్రగ‌తి పై గ్రామ స‌భ‌లు నిర్వహించి ప్రభుత్వం గ్రామంలో చేపట్టిన అభివృద్ధిని వివరించాలని పేర్కొన్నారు. ప‌దేండ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి విజయాల‌ను ప్రజ‌లకు తెలిసేలా ప్రదర్శన‌లు జ‌ర‌గాల‌ని తెలిపారు. ప్రతి ఇంటి ముందు రంగ‌వ‌ల్లులకు మ‌హిళ‌ల‌ను సిద్ధం చేయాల‌ని సూచించారు. గ్రామాల్లో మ‌హిళా సంఘాల‌ ఉత్పత్తులను ప్రద‌ర్శనలో ఉంచాలని అన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో అభివృద్ధి చెందుతున్న తీరును వివరించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement