Tuesday, April 30, 2024

రాష్ట్ర వ్యాప్తంగా 1300 కేంద్రాలలో నిరంతరం వ్యాక్సినేషన్ – మంత్రి ఈటల

కమలాపూర్ – తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 1300 కేంద్రాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మండలంలోని కమలాపూర్ ,ఉప్పల్ ,గూడూరు, అంబాల, ఉప్పల్ పల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం కమలాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఒక కోటి యాభై లక్షల విలువగల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రాజేందర్ మాట్లాడుతూ, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రైతులు గ్రామీణ ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. పొలాల వద్ద, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు మాస్కులు తప్పనిసరి ఉపయోగించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 99% మందికి ఈ వైరస్ సోకిన కూడా ప్రాణభయం ఉండడం లేదని, ఒక శాతం మందికి మాత్రమే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మంత్రి అన్నారు. వ్యాక్సిన్ కొరత లేదని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, మొదటి డోస్ తీసుకున్న ప్రతి ఒక్కరూ రెండవ డోసు తప్పకుండా తీసుకోవాలని ఆయన గుర్తు చేశారు. కాగా మండలంలోని 16 గ్రామాలకు గాను నూట నలభై తొమ్మిది చెక్కులను మంత్రి ఈటెల చేతుల మీదుగా ఈ రోజు లబ్ధిదారులకు అందజేశారు. అందులో అంబాల కు 14, భీమ్oపెళ్ళికి 6, దేశ రాజు పల్లి కి 3, గూడూరు 18 , గుండెడు కు8, గునిపర్తి 1, కమలాపూర్ కు 21, కానిపర్తి కి10, కన్నూరు కు 9, మరి పెళ్లి గూడెం కు 8, నేరెళ్ల కు 1, శనిగరం కు 9, ఉప్పల్ కు 17, వంగపల్లి కి 13, వెంకటేశ్వర్ల పల్లికి 5, మాదన్నపేట గ్రామానికి 6 చెక్కుల చొప్పున మంత్రి ఈటెల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో సింగిల్ విండో అధ్యక్షులు పేరాల సంపత్ రావు, తాసిల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement