Wednesday, May 15, 2024

Big Story: డబుల్​ బెడ్రూంల కోసం వెయిటింగ్​.. నిర్మాణం పూర్తయినా ఇస్తలేరు..

ప్రభన్యూస్‌ బ్యూరో,ఉమ్మడిరంగారెడ్డి: సొంతిళ్లు అనేది పేదల స్వప్నం… ప్లాట్ల ధరను మొదలుకుని నిర్మణ రంగానికి కావాల్సిన మెటీరియల్‌ రేట్లు పెరిగిపోయి ఇళ్లుకట్టుకోవడం కళగానే మిగిలిపోయింది. .తెరాస ప్రభుత్వం శ్రీకారం చుట్టిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకం జిల్లాలో రెండు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి మాదిరిగా తయారైంది.. సంవత్సరాలుగా నిరుపేదలు ఇళ్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.. అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్పిస్తే ప్రయోజనం చేకూరింది లేదు.. చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు ప్రారంభం కాకపోగా రెండు నియోజకవర్గాల పరిధిలో నిర్మాణాలు పూర్తి చేసినా వాటికికనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకు నిధులు కావల్సి ఉంది. వాటిని కూడా ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో అవి కూడా నిరుపయోగంగా మారాయి. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 6,777 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరు కాగా ఇందులో కేవలం 2, 045 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు.

నిరుపేదల చిరకాల స్వప్నం సొంతిళ్లు..ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు శ్రీకారం చుట్టడంతో చాలామంది సంబురపడ్డారు. తమ కోరిక నెరవేరుతుందని ఆశపడ్డారు. కానీ అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతుండటంతో చాలామంది ఆశలు వదులుకున్నారు. నిర్మాణ పనులు ప్రారంభించిన వేగంగా వాటిని పూతి చేయలేకపోతున్నారు. పూర్తి చేసిన ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితులు నెలకొన్నాయి. రంగారెడ్డి జిల్లాలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు భారీ డిమాండ్‌ ఉంది. లక్షమంది డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీళ్లు దరఖాస్తులు చేసుకుని సంవత్సరాలు గడుస్తుండటంతో వస్తాయా రావా అనే అనుమానాలు నెలకొన్నాయి.

మూడవ వంతే పూర్తి..
రంగారెడ్డి జిల్లా పరిధిలో చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం,, షాద్‌నగర్‌, రాజేంద్రనగర్‌, కల్వకుర్తి నియోజకవర్గాలున్నాయి. 2015-16…2016-17 సంవత్సరానికి గాను 6777 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 2956 ఇళ్లకు టెండర్లు పిలిచి నిర్మాణాలను ప్రారంభించారు. వీటిలో 2713 ఇళ్లు పురోగతిలో ఉండగా 2045 ఇళ్లను అతికష్టం మీద పూర్తి చేశారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, షాద్‌నగర్‌ నియోజకవర్గాల పరిధిలో 4932 ఇళ్ల నిర్మాణ బాధ్యతలను రోడ్లు భవనాల శాఖకు అప్పగించారు. చేవెళ్ల, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలో నిర్మాణాలను పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను సరియైన విధంగా పర్యవేక్షించకపోవడంతో నిర్మాణాలు పడకేసాయి. అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్పిస్తే పెద్దగా ప్రయోజనం చేకూరిన దాఖలాలు కనిపించడం లేదు. మంజూరైన ఇళ్లలో మూడవవంతు మాత్రమే చేపట్టి వాటిని కూడా సక్రమంగా పూర్తి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.

కనీస సౌకర్యాలకు నిధులెక్కడా…

జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల పరిధిలో 2045 ఇళ్లను అతికష్టం మీద పూర్తి చేశారు. వీటికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. విద్యుత్తు, డ్రైనేజీ, రోడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం దాదాపుగా రూ. 35కోట్లు అవసరం. ఆ నిధులు మంజూరు చేయాలని ఐదుమాసాల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నేటికీ పైసా విడుదల చేయలేదు. పూర్తి చేసిన ఇళ్లలో సింహభాగం షాద్‌నగర్‌ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఇక్కడ ఏకంగా 1700ఇళ్లు పూర్తి చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో 131, రాజేంద్రనగర్‌లో 130, చేవెళ్లలో 20 ఇళ్లు పూర్తి చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్లలో కేవలం 20 మాత్రమే పూర్తి చేశారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో మాత్రం 2వేలకు పైగా ఇళ్లు పూర్తి చేశారు. అందులో 1700ఇళ్లు ఏకంగా షాద్‌నగర్‌ నియోజకవర్గంలోనే ఉన్నాయి. పూర్తి చేసిన ఇళ్లలో గృహ ప్రవేశాలు జరగాలంటే కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. విద్యుత్తు, డ్రైనేజీ, రోడ్లు, లిఫ్ట్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇవి లేకుండా గృహ ప్రవేశాలు చేసే అవకాశాలు లేవు. రూ. 35కోట్ల వరకు సౌకర్యాల కోసం నిధులుకేటాయిస్తే వాటిని పూర్తి చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఐదు మాసాలుగా నిధుల కోసం వేచి చూస్తున్నా పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది.

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా..
డబుల్‌బెడ్‌రూం ఇళ్లు అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. వ్యభిచారం, తాగుబోతులు వాటిని అడ్డాలుగా చేసుకున్నారు. సాయంత్రం అయ్యిందంటే చాలు అక్కడి వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. భవన నిర్మాణాలు పూర్తి చేశారు. వాటికి తలుపులు, కిటికీలు ఏర్పాటు చేయలేదు. దీంతో ఎవరంటే వాళ్లు రావడం తమ కార్యక్రమాలను ముగించుకుని వెళ్లిపోవడం జరుగుతోంది. చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన మహిళలు అటు వైపు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. వీటిని ఎప్పుడు పూర్తి చేస్తారో ఎప్పుడు ప్రారంభిస్తారోనని ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిర్మాణాలు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా పూర్తి వినియోగంలోకి తీసుకరాకపోవడంతో

అవి నిరుపయోగంగా మారిపోయాయి. ఎమ్మెల్యేలు చొరవ చూపితేనే..
డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం విషయంలో ఎమ్మెల్యేలు పెద్దగా చొరవ తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. పూర్తి చేసిన ఇళ్లకు కూడా కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లాలో కేవలం షాద్‌నగర్‌ నియోజకవర్గంలో దాదాపుగా 1700 ఇళ్లు పూర్తి చేశారు. వీటికి కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ కాస్త చొరవ తీసుకుంటే నిధులు మంజూరయ్యే అవకాశాలున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఐదుమాసాల క్రితం కనీస సౌకర్యాల కల్పనకు గాను రూ. 35కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నేటికీ ఆ నిధులు విడుదల కాకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే విధంగా తయారైంది.

మొండికేస్తున్న కాంట్రాక్టర్లు..
డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు సంబంధించిన బిల్లులు సకాలంలో రాకపోవడంతో కాంట్రాక్టర్లు నిర్మాణాలను పూర్తి చేయడం లేదు. బిల్లుల కోసం నెలలతరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బిల్లులు కోట్లలో పెండింగ్‌లో ఉండటంతో నిర్మాణాల విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వాస్తవానికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. వత్తిడీలు చేయడం ద్వారా కొందరు ముందుకు వచ్చినా సకాలంలో బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. డబుల్‌ నిర్మాణంలో పెద్దగా లాభాలు రాకపోవడంతో ప్రత్యామ్నాయ పనులు అప్పగిస్తుండటంతో కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నారు. కానీ బిల్లుల విషయంలో మాత్రం అనుకున్నమేర రాకపోవడంతో అఇష్టంగానే నిర్మాణాలు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement