Tuesday, October 8, 2024

TS: ఓట్ల కోసం కార్మికులపై దొంగ ప్రేమ చూపుతున్న వివేక్… బాల్క సుమన్

మందమర్రి (ప్రభ న్యూస్) : ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ కార్మికులపై దొంగ ప్రేమ చూపిస్తున్నాడని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ ఆరోపించారు. శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి డివిజన్, కాసిపేట 2 మైన్ పైన గేట్ మీటింగ్ లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు వెంకట్రావుతో కలిసి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. సింగరేణితో మనది పేగు బంధం, పెన వేసుకున్న బంధం, సింగరేణి బ్రతకాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులందరూ కేసీఆర్ వెంట నడిచారని, తెలంగాణ ప్రభుత్వంలో సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లో కార్మికులకు ఆదాయపు మినహాయించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపినా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు.

సింగరేణి గనులను వేలం వేయాలంటున్న అవివేకి వివేక్ అన్నారు. సింగరేణి క్వార్టర్ కలిగిన కార్మికుడి జీతం పైన పెర్క్ టాక్స్ ను కోల్ ఇండియాలో అమలు చేస్తున్న విధంగా సింగరేణిలో కూడా యాజమాన్యమే కార్మికులకు చెల్లించేలా చేస్తామని మొన్న మందమర్రిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. సింగరేణి క్వార్టర్లను కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు ఇస్తాం. సింగరేణి ప్రాంతం మనుగడ కొనసాగాలంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నారు. 32% లాభాలను, స్పెషల్ ఇంక్రిమెంట్లను, సుమారు 17వేల డిపెండెంట్ ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చామని, ఇన్నేళ్లుగా కనబడని వివేక్ ఎన్నికలు రాగానే ఓట్ల కోసం కార్మికులపై దొంగ ప్రేమ చూపిస్తున్నాడన్నారు.. సింగరేణి కార్మికులకు అన్యాయం చేసిన కుటుంబం వివేక్ దని, సింగరేణి సంస్థపైన సింగరేణి కార్మికుల సమస్యలపై కనీస అవగాహన లేని వ్యక్తి వివేక్ అన్నారు.

కార్మికులు సంఘాల పేరు మీద ఆగం కావొద్దని, కోట్ల డబ్బులతో కార్మికులను మోసం చేయాలని వివేక్ కుటుంబం చూస్తుందన్నారు. డివిజన్ పరిధిలోని కెకె6, శ్రావణపల్లి ఓసీలను వేలానికి పెడితే ఆనాడు బీజేపీలో ఉండి కూడా ఒక్కరోజు కూడా వివేక్ పోరాటం చేయలేదన్నారు. ఈ రెండు మైన్స్ ని వేలానికి వేసి తన కంపెనీకి అప్పజెప్పాలని కుట్ర చేస్తున్నాడన్నారు. గుజరాత్ లిగ్నైట్ గనులు వారికే ఎలా అప్ప చెప్పారో అదే తరహాలో సింగరేణి గనులు సింగరేణికే కేటాయించాలన్నారు. కాంగ్రెస్ కు వేసే ఓటు సింగరేణి సంస్థను ముంచడానికేనని, దయచేసి కార్మికులందరూ సంఘాలకు అతీతంగా తనను ఆశీర్వదించాలన్నారు. కార్మికుల తరుపున గొంతునై నినదిస్తానని, ఏజెంటుగా సేవ చేస్తానన్నారు. ఈ నెల 30న జరిగే పోలింగ్ లో కారు గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీకి పంపితే అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement