Friday, May 17, 2024

దళితులకు ముఖ్యమంత్రి స్లోగన్ ఏమైంది?: ఉత్తమ్

దళితులకు ముఖ్యమంత్రి స్లోగన్ ఏమైందని సీఎం కేసీఆర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం గాంధీభవన్ లో నిర్వహించిన దళిత ఆవేదన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై ఉత్తమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దళిత మహిళ లాక్ అప్ డెత్ ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. ఈ ఘటన జరిగిన వారం తర్వాత కాంగ్రెస్ నేతలు చెబితే సీఎం స్పందించారని మండిపడ్డారు. దళిత ఎం పవర్ మెంట్ కాదు.. గతంలో దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి హామీ ఏమైందని ప్రశ్నించారు. సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ లో, సిరిసిల్లలో దళితులపై దాడులు జరిగితే దిక్కు లేదని ఉత్తమ్ విమర్శించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలియని కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. 12 శాతం జనాభా ఉన్న మాదిగలకు మంత్రి పదవి లేదని విమర్శించారు. రాష్ట్రంలో దళితులపై వేధింపులు పెరుగుతున్నాయని వెల్లడించారు. తెలంగాణలో ఎక్కువగా మోసపోయింది దళితులేనని ఉత్తమ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement