Thursday, May 2, 2024

ఉక్రెయిన్ – రొమేనియా సరిహద్దుల్లో తోపులాట.. బోర్డర్ గార్డ్స్ లాఠీచార్జీతో ఇక్కట్లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఓవైపు ‘ఆపరేషన్ గంగ’ వేగంగా సాగుతున్నప్పటికీ, మరోవైపు ఉక్రెయిన్ సరిహద్దుల్లో రద్దీ పెరిగి విద్యార్థులు నరకయాతన అనుభవించాల్సి వస్తోంది. ఉక్రెయిన్ సరిహద్దులు దాటిన అందరినీ భారత్‌కు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేయగా, సరిహద్దు దాటడమే గగనంగా మారింది. ఉక్రెయిన్ – రొమేనియా బోర్డర్ చెక్ పోస్టు వద్దకు పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు, ఆ దేశంలో చదువుకుంటున్న వివిధ దేశాల విద్యార్థులు చేరుకోవడంతో సమస్యలు మొదలయ్యాయి. దేశాన్ని విడిచి శరణార్థులుగా వెళ్తున్న ఉక్రెయిన్ పౌరులకు బోర్డర్ గార్డ్స్ ప్రాధాన్యత కల్పిస్తుండడంతో, భారత విద్యార్థులు సరిహద్దు దాటడం సవాలుగా మారింది. మైనస్ డిగ్రీల అతి శీతల వాతావరణంలో విద్యార్థులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం బుకారెస్ట్ (రొమేనియా) నుంచి ఢిల్లీ చేరుకున్న రెండు ఎయిరిండియా విమానాల్లో మొత్తం 14 మంది తెలంగాణకు చెందిన విద్యార్థులున్నారు. సరిహద్దుల్లో నెలకొన్న తోపులాట కారణంగా తమలో కొందరు తమ లగేజిని వదులుకోవాల్సి వచ్చిందని విద్యార్థులు చెబుతున్నారు. తోపులాటను నియంత్రించేందుకు బోర్డర్ గార్డ్స్ లాఠీచార్జీ చేయడంతో పలువురు విద్యార్థులు లగేజి వదిలేసి పరుగులు తీశారని, పలువురు స్వల్పంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కంటే ముందు వచ్చినవారు సునాయాసంగా బోర్డర్ దాటగలిగారని, కానీ తమ వరకు వచ్చేసరికి పెద్ద ఎత్తున శరణార్థులు కూడా కలవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. సరిహద్దులు దాటిన తర్వాత భారతదేశం మాత్రమే తమ పౌరులను స్వదేశానికి తరలించే ఏర్పాటు చేసిందని, ఆఫ్రికా దేశాలకు చెందిన విద్యార్థులతో పాటు చైనా విద్యార్థులు సైతం ఎవరికివారు తమకు తాముగా ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement