Sunday, April 28, 2024

TS Polotics: సొంత అజెండాతో రాజీనామా చేసిన ఈటలకు.. ఎందుకు ఓటేయాలి: బోయినపల్లి

ప్రజల కోసం కానీ, హుజురాబాద్ నియోజకవర్గం పనుల కోసం కానీ కాకుండా సొంత అజెండాతో ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, అలాంటప్పుడు త‌న‌కు ఎందుకు ఓటేయాలనీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు. గురువారం హుజురాబాద్ పట్టణంలోని టీ.ఆర్.ఎస్. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ను ఐదు నెలలుగా గమనిస్తున్నా.. ఒక్క రోజు కూడా అందుకు కారణం చెప్పనేలేదు అని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈటల తన బాధను, ప్రజల బాధగా మార్చేందుకు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారు తప్ప అసలు అజెండా మాత్రం చెప్పడం లేదని అన్నారు.

ప్రజలకు అన్యాయం జరిగింది అని కానీ, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగడం లేదని కానీ, పెన్షన్లు రావడం లేదని కానీ, రైతు బంధు, రైతు బీమా రావడం లేదని కానీ, ఫలానా పనులు కావాలని కోరితే రాలేదని కానీ ఎన్నడూ చెప్పలేని ఈటల రాజేందర్.. ఏ కారణం చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో చెప్పాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

సరైన కారణాలు చెప్పకుండా, సొంత అజండాతో పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ కు ప్రజలు ఎందుకు ఓటేయాలి..? అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. ఓట్లు అడిగే నైతిక హక్కు ఈటల రాజేందర్ కు లేదని, అతని పట్ల ప్రజలు కూడా స్పందించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

తల్లిలాంటి టీ.ఆర్.ఎస్. పార్టీకి, అధినేత, సీఎం కేసీఆర్ పట్ల వ్యతిరేక భావనతో, బహిరంగంగా విమర్శలు చేసిన ఈటల రాజేందర్ కు ప్రజలే తగిన రీతిలో జవాబు ఇస్తారని వినోద్ కుమార్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement