Sunday, April 28, 2024

TS – హస్తం… కలిపిన అను ‘బంధం’…కోనేరు కోనప్ప ఇంటికి రావి శ్రీనివాస్..

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) బంధాలు అనుబంధాలను చెరిపేసుకొని 20 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న మామ అల్లుళ్ళిద్దరూ ఎట్టకేలకు ఒక్కటయ్యారు. సిర్పూర్ టీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మేనల్లుడు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ రావి శ్రీనివాస్ ఇద్దరూ కాంగ్రెస్లో కలిసి పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం టిఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.

శత్రుత్వాలు పక్కనపెట్టి కోనప్పతో కలిసి పని చేయాలని అధిష్టానం నుండి పిలుపు రావడంతో మేనల్లుడు రావి శ్రీనివాస్ పంతం వీడి మామ కొనప్ప ఇంటికి నడుచుకుంటూ వెళ్లగా కోనప్ప సాదరంగా ఆహ్వానించి మేనల్లుడు శ్రీనివాస్ తో కరచాలనం చేశారు. రాజకీయ మనస్పర్ధలు కారణంగా గత 20 ఏళ్లుగా కోనప్ప, రావి శ్రీనివాస్ ప్రత్యర్థులుగా రాజకీయాలు సాగిస్తున్నారు. కోనేరు కోనప్ప పై రవి శ్రీనివాస్ మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవి చూశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బిజెపి అభ్యర్థి గెలవడంతో ఇద్దరూ కాంగ్రెస్ లో పని చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.


రేపు కాంగ్రెస్ లో చేరనున్న కోనప్ప..
సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే బి ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప గురువారం మంత్రుల సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాగజ్ నగర్ పట్టణంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీలో చేరనున్నట్టు కోనేరు కోనప్ప తెలిపారు. టిఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తనతోపాటు జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, 23 మంది కౌన్సిలర్లు, 125 మంది సర్పంచులు, 54 మంది ఎంపీటీసీలు, ఆరుగురు జడ్పిటిసిలు, ఏడుగురు ఎంపీపీలు బీఆర్ఎస్ పార్టీకి ముకుమ్మడిగా రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరుతున్నట్టు కోనప్ప ఆంధ్రప్రభ కు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement