Thursday, May 2, 2024

TS: హుజురాబాద్ గెలుపు కోసం కేసీఆర్ చెమటలు కక్కుతుండు.. అన్న‌దెవ‌రో తెలుసా!

Rangareddy: ప్రజల కళ్ళలో వస్తున్న కన్నీళ్ళను తుడిచే ఎర్రజెండా.. వాళ్లకు కొండంత అండగా నిలవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల బండారాన్ని ప్రజల ముందు బయట పెట్టేందుకు కమ్యూనిస్టులు ముందుకు కదలాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో శనివారం ప్రారంభమైన రంగారెడ్డి జిల్లా సిపిఎం పార్టీ 9వ మహాసభలకు వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పట్టించుకునే దమ్ము ధైర్యం ఖలేజా ఉన్న నాయకుడు అతను కమ్యూనిస్టు అయ్యి ఉండాలని నిర్దేశం చేశారు. పై కమిటీ పిలుపు వస్తేనే పట్టించుకోకుండా ఉద్యమ కధన రంగంలో ముందుకు దూకేవారు అయ్యి ఉండాలని పేర్కొన్నారు. పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలు, వరి రైతుల నిషేధం పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న తీరుపై గ్రామ స్థాయిలో ఆందోళనలు చేపట్టాలని, మండల, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ధర్నాలు చేయడం కన్నా ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లి ఆందోళనలు చేపడితేనే ప్రయోజనం గుర్తింపు ఉంటుందని అన్నారు.

రైతాంగాన్ని నాశనం చేసేందుకు కేంద్రం నల్ల చట్టాలను తెచ్చిందని, కార్పొరేట్ శక్తుల చేతిలో మోడీ కీలుబొమ్మగా మారారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సిపిఎం సభలో కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఏడాదికి యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేశారని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వం దేశాన్ని నిలువునా ముంచుతున్నారని అన్నారు.

హుజురాబాద్ గెలుపు కోసం కేసీఆర్ చమటలు కక్కుతుండు..
హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం కేసీఆర్ చెమటలు కక్కుతున్నాడని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకోసమే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆగమేఘాల మీద దళిత బంధు స్కీమ్ తీసుకువచ్చారని పేర్కొన్నారు. సుమారు 46 వేల మంది దళిత ఓట్లకు గాలం వేసేందుకు ఈ ప్రయోగం చేశారని విమర్శించారు. హుజురాబాద్ ఎన్నికల్లో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి అదేవిధంగా ఓటుకు 6వేలు, బీరు, బిర్యాని, మద్యంతో గెలిచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇలా డబ్బులతో ప్రతి పక్షాలు, విపక్షాలను భయపెట్టి కెసిఆర్ రాష్ట్రాన్ని ఎన్ని దినాలు పాలిస్తాడో మేము చూస్తాం అంటూ సవాల్ విసిరారు. తెలంగాణ రాకముందు కెసిఆర్ చెప్పిన మాటలు ఏమిటని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు 3 ఎకరాల భూమి, నీళ్లు, నిధులు, నియామకాలు, ఉచిత విద్య, అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వస్తాయని ప్రగల్భాలు పలికారని పేర్కొన్నారు. కానీ అలా జరగడం లేదని విమర్శించారు.

వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కాలేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, కాలేశ్వరం ద్వారా మొత్తం రాష్ట్రానికి ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. కేవలం ఒక ప్రాంత ప్రజల కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం రాష్ట్రం కాలేశ్వరం ప్రాజెక్టు కాదని అది కేవలం రెండు జిల్లాలకు పరిమితం అని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏమైందని ప్రశ్నించారు. డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల, ఖమ్మం తదితర ప్రాంతాల్లో ప్రాజెక్టులు పూర్తి కావాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా ఉమ్మడి వరంగల్ లో దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని నిలదీశారు. తెలంగాణలో ఏ జిల్లాకు నీళ్లు రాకుండా కేవలం 2 జిల్లాలకే కాలేశ్వరం ప్రాజెక్టు పరిమితము అయిందని, దీనినే పట్టుకుని రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తానంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారని విమర్శించారు. ఆంధ్ర పెత్తనాన్ని వద్దని తెలంగాణ ఏర్పాటు చేసి ఇక్కడ ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో కెసిఆర్ పాలనకు మూడింది అని త్వరలోనే ఎర్ర జెండా ఉద్యమాలు రాబోతున్నాయని అన్నారు..

- Advertisement -

కార్య‌క్ర‌మంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చేరుపల్లి సీతారాములు, వ్యవసాయ కార్మిక సంఘం అల్ ఇండియా అధ్యక్షులు బి. వెంకట్, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.జంగారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్, పార్టీ రాష్ట్ర నాయకులు కిల్లే గోపాల్, పార్టీ జిల్లా కార్యదర్శి రాంచందర్, జిల్లా కోర్ కమిటీ సభ్యులు బుస్సు మధు సూదన్ రెడ్డి, పగడాల యాదయ్య, బోడ సామెల్, కడిగాళ్ల భాస్కర్, చంద్ర మోహన్ తదితర స్థానిక నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement