Tuesday, April 30, 2024

TS: హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు ఓట్లడిగే హక్కు లేదు… డీకే అరుణ

మక్తల్, ఏప్రిల్ 25 (ప్రభ న్యూస్) : ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ఇవాళ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. మండలంలోని మగనూరు, వడ్వాట్, అడవి సత్యవార్, కొల్పూర్ తదితర గ్రామాల్లో బీజేపీ లోక్ సభ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయా గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి అరుణమ్మకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ… ఇది కాంగ్రెస్ ఓటు కాదు.. ఇది పెద్ద ఓటు.. ఈ దేశానికి ప్రధాని ఎవరో నిర్ణయించే ఓటు, ప్రజా సంక్షేమ పాలనలో మోడీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారన్నారు. కాంగ్రెస్, బీఆరెస్ కు ఓటు వేస్తే మోరీలో వేసినట్లేనని అన్నారు. మీ ప్రాంత ఆడబిడ్డను.. ఆదరించి లోక్ సభకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడో కల్వకుర్తి నుంచి వచ్చినోళ్లను నమ్మితే మరోసారి మోసపోతారన్నారు. తస్మాత్ జాగ్రత్త అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీ కూడా కాంగ్రెస్ అమలు చేయలేకపోయిందని.. ఇలానే ప్రజలను మోసం చేసి నోటికొచ్చినట్లు మాట్లాడిన కేసీఆర్ ఎక్కడికి వెళ్ళాడో చూసాం… రేపు రేవంత్ కూ అదే పరిస్థితి వస్తుందన్నారు. దేశ అభివృద్ధి కోసం పాలమూరు అభివృద్ధి కోసం కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించి మరోసారి నరేంద్రమోడీని ప్రధాని చేయాలని డీకే అరుణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య, మాగనూర్ ఎంపీపీ శ్యామలమ్మ, నాయకులు కే. సోమశేఖర్ గౌడ్, జి.బలరాం రెడ్డి, జి.నారాయణ, జయ నందన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement