Wednesday, May 1, 2024

ఎంజీఎం ఆస్పత్రిలో త్వరలో ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌..

ఎంజీఎం, ప్రభన్యూస్‌: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో త్వరలో ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్ చెప్పారు. శుక్రవారం ట్రాన్సజెండర్‌ కమ్యూనిటీ రాష్ట్ర అధ్యక్షురాలు లైలా, ట్రాన్సజెండర్‌ కమ్యూనిటీ రాష్ట్ర సలహాదారు ఈ.వి.శ్రీనివాస్‌ రావు ఆధ్వర్యంలో ఎంజిఎం కస్తూరి సేవగ్రామ్‌లో సమావేశం నిర్వహించారు. ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి. చంద్రశేఖర్‌ ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు. త్వరలో ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. ఎవరికైనా హార్మోన్ల అసమతుల్యత వల్ల ట్రాన్స్‌జెండర్‌ లాగా మారుతారు కాబట్టి చిన్నప్పుడే తల్లిదండ్రులు గుర్తించినచో వారికి చికిత్స చేయవచ్చని తెలిపారు. హార్మోన్ల అసమతుల్యత ఉన్న పిల్లలను గుర్తించడానికి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు.

ఈ సందర్భంగా ఈ.వి. శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ కమ్యూనిటీలో జీవనశైలిని మార్చుకొని తమ కాళ్ళమీద తాము బతికేటట్టు జీవించటానికి కావలసిన సహాయ సహకారాలు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఒమేగా బన్ను హాస్పిటల్‌ యం.డి డా. వి చరంజిత్‌ రెడ్డి మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీకి సపోర్ట్‌ చేస్తానని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అందించే ట్రాన్స్‌జెండర్‌ సర్టిఫికెట్స్‌ కొరకు అఫిడవిట్‌ అవసరముందని, ఈ అఫిడవిట్‌ను పొలసాని అనిల్‌ రెడ్డి అడ్వకేట్‌ తయారుచేసి అందచేయడం జరుగుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement