Tuesday, April 30, 2024

Big Story: టవర్ల వారీగా విక్రయం.. స్వగృహ ఇండ్లకు వేలం, నేడు ప్రీ బిడ్‌ సమావేశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: స్వగృహ ఆధ్వర్యంలోని ఫ్లాట్లను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. బండ్లగూడ, నాగోల్‌లోని 15 టవర్లను కనీస ధరగా చదరపు గడుగుకు రూ. 2200నుంచి రూ. 2700లకు, ఖమ్మం జిల్లా పోలేపల్లిలోని 8 టవర్లకు చదరపు అడుగుకు రూ. 1500నుంచి రూ. 2వేలకు ధరలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిల్చింది. 23న ప్రకటన జారీ చేయగా, రిజిస్ట్రేషన్లకు చివరితేదీగా మార్చి 22ను పేర్కొంది. ప్రీ బిడ్‌ సమావేశం మార్చి 4న, మార్చి 14న రెండు దశల్లో నిర్వహించనున్నారు. స్థల సందర్శనకు అదే రోజున అనుమించనున్నారు. బండ్లగూడలో ఈ వేలం మార్చి 24న ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు, ఖమ్మంలో అదేరోజున మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.

ఈ టవర్లను టోకుగా కొనుగోలు చేసేందుకు అర్హులైన బిల్డర్లు, కాంట్రాక్టర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. యధాతథ స్థితిలోనే టవర్లను విక్రయిస్తారు. మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే పూర్తి చేసి అందించనుంది. బండ్లగూడలోని సహభావన భవన సముదాయంలోని 15 టవర్లలో 2245 ఫ్లాట్‌లను విక్రయించాలని ఈ నోటిఫికేషన్‌లో పేర్కొనగా, ఇందులో సింగిల్‌ బెడ్‌రూం, 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్స్‌ ఉన్నాయి. ఖమ్మంలోని జలజ టౌన్‌షిప్‌లో 8 టవర్లలో 576 ఫ్లాట్స్‌ను విక్రయించనుండగా, ఇందులో అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్స్‌ మాత్రమే ఉన్నాయని అధికారులు చెప్పారు. హైదరాబాద్‌లోని ఫ్లాట్లకు ప్రీ బిడ్‌ ఈఎండీ ధర రూ. 10లక్షలను, ఖమ్మం జిల్లా పోలేపల్లి ఫ్లాట్లకు రూ. 5లక్షలు ఈఎండీ ఒక్కో టవర్‌కు చెల్లించాలని నిర్దేశించారు. ఇందులో విదేశీ పెట్టుబడులకు కూడా అవకాశం కల్పించారు.

వచ్చే ఆర్ధిక యేడాదిలో రాష్ట్రంలోని 7వేలకుపైగా ఫ్లాట్లను, దిల్‌కు చెందిన వేలాది ఎకరాల భూములను విక్రయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. స్వగృహ కార్పొరేషన్‌కు చెందిన ఖాళీ ఫ్లాట్లు, ఇండ్ల గుర్తింపుపై గతవారం కార్పొరేషన్‌ అధికారులు సీఎస్‌ సోమేష్‌కుమార్‌ను కలిసి వివరాలు అందించారు. దిల్‌ సంస్థకు చెందిన భూముల వివరాలను రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఈ రెండింటి భూములు, ఆస్తులను ఆన్‌లైన్‌ వేలం పద్దతిలో కనీస ధర నిర్ణయించేందుకు ప్రభుత్వం, స్వగృహ కార్పొరేషన్‌ కసరత్తు ముమ్మరం చేసింది.
ప్రాజెక్టుల వారీగా ఫ్లాట్లతోపాటు, స్వగృహ కార్పొరేషన్‌కు చెందిన ఖాళీ స్థలాలను కూడా విక్రయించాలనే నిర్ణయం తుది రూపానికి వచ్చింది. నాగోల్‌-బండ్లగూడ, పోచారం, జవహార్‌నగర్‌, గాజుల రామారంలలోని 10వేలకుపైగా ఫ్లాట్లను ఈ మేరకు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఇవి ఏ స్టేజ్‌లో ఉన్నాయో…వాటికి గతంలో వచ్చిన దరఖాస్తులు, సొమ్ములు చెల్లించినవారి వివరాలను నివేదికలో పొందుపర్చారు. బండ్లగూడలో మొత్తం 2746 ఫ్లాట్లను నిర్మించారు. అయితే ఇందులో 500వరకు విక్రయించగా, మిగిలిన 15 టవర్లను విక్రయిస్తున్నారు. జవహర్‌నగర్‌లో 48ఎకరాల్లో నిర్మితమై ఉన్న 6214 ఫ్లాట్లలో లక్ష దరఖాస్తులురాగా, ధర ఎక్కువగా ఉందన్న కారణాలతో పలువురు వెనక్కు తగ్గారు. ఇలా పేరుకుపోతున్న ఇండ్లు, ఫ్లాట్లతో 60శాతంపైగా పూర్తయిన పనులతో అసంపూర్తి ఫ్లాట్లు పరిరక్షణ కష్టతరంగా మారింది. వేలం పద్దతిలో విక్రయించాలని భావిస్తున్న ఈ ఫ్లాట్లకు, ఓపెన్‌ స్థలాలకు త్వరలో నోటిఫికేషన్‌ జారీకి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కార్యాచరణ చేస్తున్నది. తద్వారా భారీగా పన్నేతర రాబడులను ఆర్జించాలని యోచిస్తోంది.

దిల్‌పై కూడా…

నిరుపయోగ భూముల విక్రయంతో పన్నేతర రాబడిని సమకూర్చుకోవాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం పూర్తి నివేదికలు సిద్దం చేసింది. దిల్‌ (దక్కన్‌ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌)కు కేటాయించిన భూముల అంశంపై ప్రభుత్వం కీలక నివేదికలు కోరుతూ అధికారులను అప్రమత్తం చేసింది. విభజన సమస్యల్లో కీలకమైన ఈ భూముల సమస్యలను త్వరలో తేల్చి విక్రయించేకునేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు మార్గదర్శకాలతో కూడిన ఫార్మాట్‌తో ఆయా భూముల వివరాలను సేకరించింది. రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి నిమిత్తం 2007లో అప్పటి సీఎం వైఎస్‌ నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లోని సుమారు 5100 ఎకరాలను దక్కన్‌ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌(దిల్‌)కు కేటాయించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర అవసరాల మేరకు నిరుపయోగంగా ఉన్న సదరు భూముల కేటాయింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

ఈ మేరకు ఆయా భూములను తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. అందులో కొంత మేర నల్గొండ జిల్లాలోని సుమారు 300 ఎకరాలను యాదాద్రి టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి కేటాయించాలని యోచించింది. అదేవిధంగా మిగతా భూములను కూడా ప్రభుత్వ, ప్రజోపయోగ అవసరాలకు వినియోగిం చే దిశగా ప్రణాళికలను రూపొందించుకుంది. ఇందులో భాగంగా నిర్ధేశిత అవసరాలు, ప్రభుత్వ యోచన సఫలం అయ్యేలా రెవెన్యూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 5వేల పైచిలుకు విలువైన భూములను గుర్తించి రాష్ట్ర లాండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ పరిధిలోని భూమి బ్యాంకుకు చేర్చాలను సూచించింది. దిల్‌ సంస్థకు కేటాయించిన భూముల్లో తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నాలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మొయినాబాద్‌ మండలం అజీజ్‌ నగర్‌లో 126 ఎకరాలను దిల్‌కు కేటాయించారు. కాగా ఇప్పటివరకు సర్వే చేసిన అధికారులకు అందులో 66 ఎకరాలు మాత్రమే దొరికింది. రెవెన్యూ రికార్డులు, పొజిషన్‌లో అదే కనిపించింది. కాగా మిగతా 60 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లుగా తేలింది. అదేవిధంగా విలువైన ప్రాంతంగా పేరున్న రాజేంద్రనగర్‌ మండలంలో కేటాయించిన 41 ఎకరాలకుగానూ 21 ఎకరాలే గుర్తించగలిగారు. సరూర్‌నగర్‌ మండలం నాదర్‌గుల్‌లో 197 ఎకరాలూ కనిపించడంలేదని, కీసర మండలంలో 10 ఎకరాల్లో ఇంచు భూమి కూడా మిగలలేదని వెల్లడైంది.

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూర్‌లో 117 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండి) లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్నది. దీనిలో దాదాపు వెయ్యి ప్లాట్ల వరకు ఉండే తొర్రూర్‌లే అవుట్‌లో ప్రస్తుతం 30 ఎకరాల్లో 223 ప్లాట్లను అభివృద్ధి చేసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టిసి ద్వారా ఆన్లైన్‌ ఆక్షన్‌ పద్దతిలో విక్రయించేందుకు హెచ్‌ఎండిఏ సన్నాహాలు చేస్తున్నది. ఇందుకు సంబంధించి శుక్రవారం(25వ తేదీన) ప్రీబిడ్‌ మీటింగ్‌ను హెచ్‌ఎండిఏ తోర్రూర్‌ సైట్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.
మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా 300 చదరపు గజాల నుంచి 600 చదరపు గజాల వరకు ప్లాట్ల సైజుతో హెచ్‌ఎండిఏ లే అవుట్‌ను రూపొందించింది. లే అవుట్‌కు ముందు వంద అడుగుల ప్రధాన రహదారి(మాస్టర్‌ ప్లాన్‌ రోడ్‌), లే అవుట్‌ లోపల 60 అడుగులు, 40 అడుగుల వెడెల్పుతో రహదారులను హెచ్‌ఎండిఏ ఏర్పాటు చేస్తుంది. తొర్రూర్‌ లే అవుట్‌లో గజానికి కనీస(బేసిక్‌ రేటు) ధర రూ.20,000లుగా ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ లే అవుట్‌లో ప్లాట్లను కొనుగోలు చేయాలనుకునే వారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టిసికి రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.1,180లు చెల్లించి నమోదు చేసుకోవాలి. అంతే కాకుండా ఈ ఆక్షన్‌లో పాల్గొనేందుకు ప్రతి ప్లాట్‌కు లక్ష రూపాయల చొప్పున ఎర్లీ మనీ డిపాజిట్‌(ఈఎండి) చెల్లించాల్సి ఉంటుంది. మార్చి మూడో వారంలో 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒక దఫా, మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరొక దఫా చొప్పున నాలుగు రోజుల పాటు ఆన్‌లైన్‌ పద్దతిలో ఎంఎస్‌టిసి ద్వారా ప్లాట్ల ఈ వేలం ప్రక్రియ జరుగుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement