Tuesday, May 14, 2024

నేడు తెలంగాణ క్యాబినెట్‌ స‌మావేశం..రైతాంగానికి భారీ ఊరట?

హైదరాబాద్ – రైతాంగానికి భారీ ఊరటతోపాటు, సరికొత్త ప్రకటనల దిశగా నేడు మంత్రివర్గం భేటీ అవుతోంది. వ్యవసాయ రుణమాఫీపై ఈ సమావేశంలో కీలక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉద్యోగుల సమస్యలకు సరికొత్త రీతిలో పరిష్కారం చెప్పేందుకు సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారని, పీఆర్సీతోపాటు, డీఏలు, సీపీఎస్‌, ఆరోగ్య పథకంపై ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు, గవర్నర్‌ తిప్పిపంపిన బిల్లులపై మంత్రిమండలి చర్చించనుంది. ఈ 50కి పైగా అంశాలే కాకుండా టేబుల్‌ ఐటెంలుగా మరికొన్ని అంశాలపై కూడా సమావేశం ప్రాధాన్యతా క్రమంలో చర్చించనుంది. ఉద్యోగుల బదలీలు, ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ భర్తీపై కూడా చర్చించనున్నారు.

ఒకవైపు త్వరలో సమీపిస్తున్న ఎన్నికలు, మరోవైపు వర్షాలు వరదలు, కేంద్ర బృందాల రాక, ఆగస్టు 3నుంచి అసెంబ్లిd సమావేశాలు వెరసి నేడు 50కి పైగా అతిముఖ్యమైన అంశాలతో కేబినెట్‌ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమవుతోంది. ఈ సమావేశంలో అతి భారీ వర్షాలు, వరద నష్టంపై సమీక్షించనుండగా, కొత్త పథకాలు, హామీలపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది. శాసనసభా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనుసరించాల్సిన వ్యూహలు, ప్రస్తుం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల విస్తరణ, పెండింగ్‌ అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశాలున్నాయనే అంచనాలు వ్యక్తమవు తున్న నేపథ్యంలో ప్రధానంగా ఎన్నికల కోణంలో అనేక అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. అన్ని శాఖలు, పథకాలు, ఆర్థికపరమైన అంశాలతో పాటు, ప్రజలకు ఇంకేం చేయాలనే వాటిపై సీఎం కేసీఆర్‌ మంత్రివర్గ సహచరులతో చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. శాఖల వారీగా చేయాల్సిన పనులు ఇంకా పెండింగ్‌లో ఉంటే వాటి వివరాలను ఇప్పటికే తెప్పించుకున్న ప్రభుత్వం వాటిపై కీలక నిర్ణయాలను తీసుకోనుంది. ఇప్పటికే ఇందుకు అనువుగా అనేక శాఖల అధిపతులు సమగ్ర నివేదికను ప్రభుత్వా నికి అందించారు. తాజాగా కురిసిన అతిభారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం భారీగా నష్టపోయింది. ఈ అత్యవసర చర్యలపై కేబినెట్‌లో చర్చించాలని నిర్ణయించారు. అన్ని రకాల పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో దీనిని అసాధారణ, అత్యవసర విపత్తుగా భావించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వరద సాయం పొందే దిశగా ప్రణాళికపై చర్చించనున్నది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ విధానాల అమలు, లభ్యత, ఉపయుక్తతపై చర్చించనుంది. రోడ్ల పునరుద్దరణ వంటి వాటిపై చర్చించనున్నారు.


సంక్షేమ పథకాలపై…
రైతుబంధు, దళితబంధు రెండో విడత, గృహలక్ష్మి పథకం, బీసీలు, మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం, వైద్య విద్య సంచాలకుల పరిధిలోని డీఎంఈ, అదనపు డీఎంఈ, సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్‌ తదితర పోస్టుల్లో నియామకాలకు ప్రస్తుత అర్హత వయసును 57నుంచి 64 ఏళ్లకు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులపై చర్చించి కేబినెట్‌ ఆమోదం తెలుపనుంది.
బిల్లులపై….


గతంలో గవర్నర్‌ ఆమోదం కోసం పంపిన బిల్లులలో వివరణ కోరిన, తిరస్కరించిన బిల్లులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏం చేయాలనే కోణంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో ఉభయ సభలు ఆమోదించిన 11 బిల్లులను గవర్నర్‌ అనుమతి కోసం ప్రభుత్వం పంపగా, వాటిలో నాలుగింటికి గవర్నర్‌ తమిళిసై ఆమోదముద్ర వేశారు. రెండు బిల్లులను రాష్ట్రపతికి పంపారు. మూడింటిని తిరస్కరించి రెండింటిపై ప్రభుత్వం నుంచి వివరణ కోరిన సంగతి తెలిసిందే. ఇలా తిరస్కరించిన మూడు బిల్లులు, వివరణ కోరిన మరో రెండు బిల్లులపై ఈ భేటీలో కీలకంగా చర్చించనున్నారు. ఎలా ముందుకు వెళ్లాలనే దిశగా చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బిల్లులలో గవర్నర్‌ కోరినట్లుగా సవరణలు చేసి పంపిస్తారా లేక వాటిని పక్కన పెడ్తారా అనేది నేడు తేలిపోనున్నది. ఈ భేటీ తర్వాత ఆగస్టు 3నుంచి జరిగే అసెంబ్లిd సమావేశాల ద్వారా ప్రజలకు చేరవేయాల్సిన సమాచారం, పథకాల వివరాలు, లబ్ధిదారుల సంఖ్య, కొత్త పథకాలు, ఇతర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు.


అజెండాలోని మరికొన్ని అంశాలు…

  • బుద్వేల్‌లోని ప్రభుత్వ భూమి విక్రయాలపై చర్చ
  • ఓఆర్‌ఆర్‌కు అనుబంధంగా కొత్త కారిడార్ల నిర్మాణం
  • మెట్రో ఫేజ్‌-2 బీహెచ్‌ఈఎల్‌- లక్డీకాపూల్‌- నాగోల్‌- ఎల్‌బీనగర్‌ విస్తరణ పనులు
  • మహబూబాబాద్‌ జిల్లా మల్యాల్‌లో హార్టీకల్చర్‌ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదన
  • సభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్న తెలంగాణ అల్లోపతిక్‌ ప్రైవేట్‌ మెడికల్‌ కేర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ బిల్లు
  • నిమ్స్‌కు రుణ సేకరణ
  • నిమ్స్‌ నిర్మాణ పనులకు సంబంధించి అంచనా వ్యయాన్ని రూ.1571 కోట్ల నుంచి రూ.1698 కోట్లకు పెంపుదల
  • మామునూరు ఎయిర్‌పోర్టుకు నిర్మాణానికి అదనపు భూ సేకరణ
  • గవర్నర్‌ తిప్పిపంపిన బిల్లులపై చర్చ
  • కొత్త మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల ఏర్పాటు
  • తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ యాక్టు బిల్లు
  • అనాథ పిల్లల పాలసీ
  • తసంతా ప్రాజెక్ట్సస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌కు ప్రతిపాదనలు
  • సింగరేణి కాలరీస్‌ లిమిటెడ్‌కు క్వార్టర్ల నిర్మాణానికి గచ్చిబౌలిలో స్థలం కేటాయింపు
  • టీఎస్‌ ట్రాన్స్‌కో రుణ సేకరణకు ఆమోదం. రూ.5 వేల కోట్ల టర్మ్‌ రుణాలకు ఆమోదంపై చర్చ

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement