Sunday, May 5, 2024

Telangana: కావాలనే నన్ను పక్కన పెడుతున్నారు.. బీజేపీ నాయకత్వంపై విజయశాంతి అసంతృప్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తనను కావాలనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పక్కన పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ పార్టీతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, రాష్ట్ర నాయకత్వమే తనను ఉపయోగించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై జాతీయ నాయకత్వం దృష్టి సారించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా పార్టీకి కొద్దికాలంగా తాను దూరంగా ఉన్న మాట వాస్తవమేనని, 24 ఏళ్ళు బీజేపీలో పనిచేశానని ఆమె గుర్తు చేశారు.

గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్లో విజయశాంతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ ప్రసంగంతో సభ ముగిసింది. విజయశాంతికి మాట్లాడే అవకాశం రాకపోవడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాపన్న జయంతి ఉత్సవాల్లో ఎందుకు మాట్లాడలేదని ఆమెను కలిసి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తన సేవలను ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్‌, లక్ష్మణ్‌లకు తెలియాలన్నారు. పార్టీ తనకు ఏమి బాధ్యతలు ఇచ్చారని పార్టీలో పనిచేయాలని ఆమె ప్రశ్నించారు.

ఒకరిద్దరితో పార్టీలో పనులు జరగవన్నారు. ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళను ముందు వరసలో ఉంచాలని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆమె కోరారు. బాధ్యత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తాను పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు చురుగ్గా పాల్గొనడం లేదనే అనుమానాలు మీడియాకు వచ్చాయని, ఇదే విషయాన్ని బండి సంజయ్‌ను మీడియా అడిగితే బావుటుందని ఆమె పేర్కొన్నారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement