Friday, May 17, 2024

Delhi: ధరలు తగ్గించాలి, కేంద్రం వైఖరి మార్చుకోవాలి.. నిత్యావసరాలతో టీఆర్‌ఎస్ ఎంపీల ఆందోళన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విపక్షాలు మండిపడ్డాయి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపునకు వ్యతిరేకంగా పలు ప్రతిపక్ష పార్టీలు నిరసనకు దిగాయి. బుధవారం ప్రారంభమైన కొద్దిసేపటికే పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడ్డాయి. ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెంపు వంటి కీలక అంశాలపై ప్రతిపక్షాల నిరసనలు, అంతరాయాల మధ్య ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. అనంతరం సామాన్యుడి నడ్డి విరుస్తున్న ధరల పెరుగుదలను నిరసిస్తూ టీఆర్‌ఎస్ పార్టీ మూడోరోజూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించింది. ఆ పార్టీ పార్లమెంటరీ నేతలు కె. కేశవరావు, నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, కె. ఆర్.సురేష్ రెడ్డి, మాలోత్ కవిత, బొర్లకుంట వెంకటేష్ నేతకాని, పోతుగంటి రాములు, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాసరెడ్డి, దామోదరరావు, రంజిత్ రెడ్డి, బండి పార్థసారధిరెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర తదితరులు ధర్నాకు దిగారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ఎంపీలు మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే, ఎన్సీపీ ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలేతో పాటు ఇతర విపక్షాల ఎంపీలూ ఈ ఆందోళనలో పాల్గొన్నారు. సిలెండర్ల కటౌట్లు, పాలు ప్యాకెట్లతో పాటు నిత్యావసర వస్తువులను పట్టుకుని ప్లకార్డులతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలపై మోపిన ధరలు, పన్నుల భారాన్ని తగ్గించాలని ఎంపీ నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సమానంగా పెంచుతున్న గ్యాస్, డీజిల్,పెట్రోలు ధరలు ఆమోదయోగ్యం కాదని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పేద, మధ్యతరగతి ఇవి ‘అచ్ఛే దినా లేక ‘చచ్చే దినా అని ఆయన ప్రశ్నించారు. ఎల్పీజీ సిలెండర్‌పై ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించడంతో సభలను గురువారానికి వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement