Sunday, April 28, 2024

ప్రమోషన్లు కావాలంటే టెట్‌ తప్పనిసరి.. ఆందోళనలో టీచర్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలంటే వారికి టెట్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉండడంతో టెట్‌ పరీక్షను ఏప్రిల్‌ చివరన లేదా మేలో నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మరోవైపు టీచర్లలో ఈ టెట్‌ తీవ్ర అలజడి రేపుతోంది. ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్లు లేక అదే పోస్టులో వేలమంది ఉపాధ్యాయులు కొనసాగుతున్నారు. వీరిలో కొంత మంది పదవీ విరమణకు దగ్గరలో ఉన్నారు. ప్రమోషన్‌ తీసుకోకుండానే రిటరవుతున్నామనే ఆందోళన చాలా మందిలో ఉంది.

తీరా పదోన్నతులు చేపడుతామనే సమయంలో టెట్‌ తప్పనిసరి నిబంధన తెరమీదకు రావడంతో ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ మాత్రం టెట్‌ నిర్వహణకే మొగ్గుచూపుతోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ చివరన లేదా మేలో ఈ పరక్షను నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు ఉండడంతో ఆ మయంలో టెట్‌ పరీక్షకు టీచర్లు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేరు. దీంతో వారికి ప్రిపేరయ్యేందుకు కొంత సమయమిచ్చి ఆతర్వాత టెట్‌ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -

ప్రభుత్వ టీచర్లకు పదోన్నతి కల్పించడానికి టెట్‌ తప్పనిసరి కావడంతో పరీక్ష నిర్వహణ దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వాలంటే టెట్‌ అర్హత తప్పనిసరి ఉన్నాగానీ గత కొంత కాలంగా వారికి మినహాయింపునిస్తూ ప్రభుత్వం వస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1.03 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. వీరిలో 60 వేల మంది వరకు టెట్‌ పరీక్ష రాసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.

టెట్‌ అర్హత ఉంటే తప్ప పదోన్నతులు కల్పించడానికి వీల్లేదని 2012 లోనే కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టు కూడా టెట్‌ తప్పనిసరి అని తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో గత ఏడాది నుంచి పదోన్నతులు నిలిచిపోయాయి. విద్యాహక్కు చట్టం, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం టీచర్లుగా నియమితులైన వారు పదోన్నతి పొందాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే టెట్‌ నిర్వహణపై విద్యాశాఖ దృష్టిసారించింది. ఈ పరిణామం వేల మంది సీనియర్‌ ఉపాధ్యాయులకు కలవరపాటుకు గురిచేస్తోంది. 2012కు ముందు టెట్‌ లేకపోవడంతో అంతకుముందే ఉన్న దాదాపు 60 వేల మంది టీచర్లకు ఈ అర్హత లేదు. టెట్‌ పరీక్ష రాస్తే అందులో అర్హత సాధిస్తామా? లేదా? ప్రమోషన్లు వస్తయా? లేదా? అన్న ఆందోళన టీచర్లలో మొదలైంది.

టెట్‌ నిర్వహణపై ఉపాధ్యాయుల్లో భిన్నాబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించాలంటే ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత రావాల్సి ఉంది. పదోన్నతుల ప్రక్రియ పూర్తయితేగాని మొత్తంగా ఖాళీల లెక్క తేలనిపరిస్థితి. మరోవైపు టెట్‌ నుంచి తమకు మినహాయింపునిచ్చి ప్రత్యేక పరీక్షను నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. మెగా డిఎస్సీకి టెట్‌ కూడా ఒక ఆటంకం కానుంది.

రాష్ట్రంలోని దాదాపు 10 వేల స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. ఇవి కాకుండా ఇంకా 12 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు మరో 22 వేల ఎస్జీటీ టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెట్‌ లేని కారణంగా పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కావడం లేదు. ఈ కారణంగానే టెట్‌ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు పార్లమెంట్‌ ఎన్నికలకు గడువు కూడా సమీపిస్తుండటంతో ఇప్పట్లో టెట్‌ నిర్వహణ ఉంటుందా? లేదా? అనే అనుమానలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement