Sunday, April 28, 2024

Job calander పై మాట తప్పిన జగన్ – రేపు యువ మోర్చా నిరశన దీక్ష

మచిలీపట్నం, జనవరి 7( ప్రభ న్యూస్):యువత జీవితాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెలగాటమాడుతున్నారని భారతీయ జనతా యువ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ కృష్ణ విమర్శించారు. ఆదివారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బీజేవైఎం రాష్ట్ర పదాధికారులు సమావేశం జరిగింది.

ఈ సమావేశం అనంతరం పాత్రికేయులతో వంశీకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రతి ఏటా జనవరి 1న ప్రకటిస్తామని మాయ మాటలు చెప్పి ఇప్పుడు మాట తప్పిన జాబ్ క్యాలెండర్ అంశంపై భారతీయ జనతా యువ మోర్చా పోరాటం చేస్తుందన్నారు. అందులో భాగంగా సోమవారం విజయవాడలో నిరాహారదీక్ష నిర్వహిస్తున్నమాని తెలిపారు. గడిచిన ఐదేళ్లుగా నిరుద్యోగ సమస్యతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకు ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటున్నారని వాపోయారు.

గడిచిన ఐదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదు జాబ్ క్యాలెండర్లు విడుదల చేయాల్సి ఉన్నా ఎక్కడా అది జరగలేదన్నారు.యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గడిచిన 2024 జనవరి 1 వ తేదీ ముఖ్యమంత్రిగా చివరి జనవరి 1 గా మిగలబోతుందని జోష్యం చెప్పారు.

ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు 2.3 లక్షల ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయకుంటే రాష్ట్రంలోని యువత రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రచారం కూడా చేయనిచ్చే పరిస్థితి లేదని హెచ్చరించారు. ఒకసారి ప్రజలు అవకాశం ఇస్తే పరదాల చాటున దాక్కుని ఏదేళ్ల పాటు పరిపాలన చేశారని, ఇక ప్రజలు బుద్ది చెప్పే సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో వైసీపీ ప్రభుత్వం రూ.100 కోట్ల మేర నిధులు మంజూరు చేసి భారీ ఎత్తున అవినీతి చేస్తోందని ఆరోపించారు. ఈ అవినీతి పట్ల న్యాయ పోరాటంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో, ఇప్పుడు వైసీపీ హయాంలో రాష్ట్రంలో యువతకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. అప్పుడు ఇప్పుడు బీజేవైఎం యువత పక్షాన నిలబడి పోరాటం చేస్తూనే ఉందని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఆడుదాం ఆంధ్ర అనే 50 రోజుల క్రీడా పోటీలకు ఈ ప్రభుత్వం 100 కోట్లు కేటాయించి ఖర్చు పెడుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పు ఎవరూ కనిపించని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మొత్తం పార్టీ ప్రచారం కోసం తప్ప యువతకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చడం లేదని విమర్శించారు. నాసిరకం బ్యాట్లు, క్రీడా కిట్లతో, ఫేక్ నమోదులతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరుగుతుందన్నారు.

- Advertisement -

ప్రభుత్వం గొప్ప కోసం వాలంటీర్లతో ఫేక్ నమోదు భారీగా చేయించిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒకే ఒక్క సారి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి కేవలం 10,143 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసి నేటికి వాటిలో కొన్ని పూర్తిగా భర్తీ చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వమని దుయ్యబట్టారు.ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయని హడావుడిగా కేవలం 10 వేల ఉద్యోగాలకు రెండు మూడు నోటిఫికేషన్లు విడుదల చేసిన ఈ ప్రభుత్వం వాటిని కూడా ఎన్నికల కంటే ముందు పూర్తి చేసే పరిస్థితి లేదని తెలిపారు. ఈ విధంగా అడుగడుగునా యువతను మోసం చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అదే యువత ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు

.ఈ సమావేశంలో రాష్ట్ర బీజేవైఎం ప్రధాన కార్యదర్శి నవనీత్ కృష్ణా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement