Saturday, October 12, 2024

NZB: దుష్టశక్తుల కబంధ హస్తాల నుండి తెలంగాణను లాక్కోవాలి.. జితేందర్ రెడ్డి

జుక్కల్ (కామారెడ్డి) : దుష్టశక్తుల కబంధ హస్తాల నుండి తెలంగాణను లాక్కొని తెలంగాణా తల్లికి విముక్తి కల్పించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార అధ్యక్షతన జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం బూత్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జితేందర్ రెడ్డి ప్రసంగించారు. బూటకపు, అసత్య మాటలు చెప్పి ప్రజలను గారడి చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రకాలుగా దోచుకోవడం జరుగుతుందని, గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగురవేసి శ్రీరాముని పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి మోడీ పాలనపై యువత, విద్యావేత్తలు అకర్షితులై బీజేపీకి పట్టం కట్టనున్నారని, అధికారంలో ఉన్నా.. లేకున్నా మాజీ ఎమ్మెల్యే అరుణతార ప్రజల సేవకు జీవితం అంకితం చేశారు కాబట్టి అరుణతారకు అత్యధిక మెజార్టీతో గెల్పించాలన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. బూత్ కమిటి సభ్యులు రామబాణంలా ఎన్నికల్లో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సాగౌడ్, కొప్పు భాషా, కుమార్, కాంచన, బద్దం మహిపాల్ రెడ్డి, మల్యేదీ రెడ్డి, విఠల్, సంతోష్ పాటిల్, శ్రీధర్ పంతులు, కిష్టారెడ్డి, శివాజీ రావు పాటిల్, కిష్ట రెడ్డి, బీజేపీ జిల్లా, రాష్ట్ర నేతలు, జుక్కల్ నియోజకవర్గ అన్ని మండలాల నుండి బూత్ కమిటీ సభ్యులు వందలాదిగా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement