Sunday, April 28, 2024

అదుపులోకి వ‌స్తున్న క‌రోనా…. నాలుగు వారాలు అప్ర‌మ‌త్తంగా ఉండండి…డాక్ట‌ర్ శ్రీనివాసులు…

హైదరాబాద్: క‌రోనా భ‌యంతో అధిక సంఖ్యాకులు ప‌రీక్ష‌లు కోసం వ‌స్తుండ‌టంతో కేసులు సంఖ్య పెరుగుతున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు తెలంగాణ ప్ర‌జారోగ్య శాఖ డైరెక్ట‌ర్ శ్రీనివాస్.. క‌రోనా లేని వాళ్లు క‌రోనా ఉన్న వాళ్ల‌తో క‌ల‌సి ప‌రీక్ష‌ల కోసం నిలుచోవ‌డం వ‌ల్ల వారు కూడా క‌రోనా భారీన ప‌డుతున్నార‌ని అన్నారు.. జ్వరం, వాసన కోల్పోవడం, రుచి కోల్పోవడం లాంటి కొవిడ్ లక్షణాలు ఉన్నవారే టెస్టుకు రావాలన్నారు. కొవిడ్‌ టెస్టింగ్ కేంద్రాల్లో గుంపులుగా ఉండటం సరికాదని.. సాధారణ లక్షణాలు రెండు మూడు రోజులకుగానీ తగ్గకపోతేనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. ”అవసరం లేకుండానే ప్రజలు ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడింది. ఆక్సిజన్‌, ఔషధాలు, పడకల విషయంలో మనం మెరుగైన స్థితిలో ఉన్నాం. ఏడాదిన్నరగా ప్రజారోగ్య సిబ్బంది అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కుటుంబం, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి ప్రజలకు సేవ చేస్తున్నారు. మే నెలాఖరు వరకు ప్రజలు సామాజిక బాధ్యతగా మాస్కులు ధరిస్తూ జాగ్రత్తలు పాటించండి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 45 లక్షల మందికి టీకా ఇచ్చాం. టీకా వేసుకున్నవారిలో ఎవరూ తీవ్రమైన అస్వస్థతకు గురికాలేదు. టీకా వేసుకున్న వారికి వైరస్‌ సోకినా ఆస్పత్రిలో చేరలేదు. టీకా వేసుకున్న వారిలో 80 శాతం మందికి కొవిడ్‌ సోకలేదు. 18 ఏళ్లు పైబడిన వారు టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది” అని డీహెచ్‌ వివరించారు. కాగా, గత వారంలో రోజులుగా తెలంగాణలో పరిస్థితులు కొంతమేర కుదుటపడుతున్నాయని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ అన్నారు. కొవిడ్‌ కేసుల పెరుగుదలలో స్థిరత్వం కనిపిస్తోందని చెప్పారు. కొవిడ్‌పై ప్రజలందరికీ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు సహకరిస్తున్నారని.. వచ్చే మూడు, నాలుగు వారాలు అత్యంత కీలకమన్నారు. వచ్చేది పెళ్లిళ్లు, పండగల సీజన్‌ కాబట్టి ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లక్షణాలు ఉన్నవారికే కరోనా టెస్టులు చేస్తున్నట్లు డీహెచ్‌ తెలిపారు. విరేచనాలు, కొవిడ్‌ బాధితులకు రాష్ట్ర వ్యాప్తంగా పడకలు అందుబాటులో ఉన్నాయని.. బాధితుల సంఖ్య పెరిగినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పడకల సంఖ్యను పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వం, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి కరోనా బాధితులకు 50 వేల పడకలు కేటాయించామని తెలిపారు. వైరస్‌ సోకిన 85 శాతం మందికి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని.. అవసరమైతే తప్ప ఆస్పత్రులకు రావొద్దని డీహెచ్‌ ప్రజలకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement