Wednesday, May 1, 2024

ఆర్డీఎస్ పనులను అడ్డుకోండి: కృష్ణాబోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

నీటి ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది. ప్రాజెక్టుల అంశానికి సంబంధించి ఫిర్యాదు చేసుకుంటున్నాయి. తాజాగా ఏపీ నిర్మిస్తున్న ఆర్డీఎస్ నిర్మాణం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు లేఖ రాసింది. పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాన్ని చేపట్టిందని, వెంటనే వాటిని నిలిపివేయాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-2 నిర్ణయాన్ని కేంద్రం ఇంకా నోటిఫై చేయలేదని, ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు అమల్లోకి రాకపోయినా ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాన్ని చేపట్టిందని ఆ లేఖలో ఆరోపించారు. ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణ పనులు జరుగుతున్న ఫొటోలను ఈ లేఖకు జతచేశారు. దీనివల్ల తెలంగాణ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని, కాబట్టి వెంటనే పనులను నిలిపివేయాలని కోరారు.

మరోవైపు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పర్యటన వాయిదా పడిన సంగతి తెలిసిందే. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పర్యవేక్షించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. బుధవారం(జూన్ 30) జరగాల్సిన ఆకస్మిక పర్యటనను కృష్ణా రివర్ బోర్డు వాయిదా వేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్ర ప్రదేశ్ సమాచారం ఇచ్చాకే పర్యటనకు వెళ్లాలని కృష్ణా రివర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అవసరమైతే కేంద్ర భద్రతా బలగాలు సాయం కూడా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు కేంద్ర భద్రతా బలగాలను తీసుకువెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. జూలై 3వ తేదీలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర జల శక్తి శాఖ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ ఒకటి రెండు రోజుల్లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్ర ప్రదేశ్ కి సమాచారం ఇచ్చి పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. జూలై 1 నుంచి కొత్త రూల్స్!

Advertisement

తాజా వార్తలు

Advertisement