Friday, March 15, 2024

job mela: జాబ్ మేళాను స‌ద్వినియోగం చేసుకోండి… మంత్రి త‌ల‌సాని

హైదరాబాద్: విద్యార్ధుల వద్దకే వచ్చి ప్రముఖ సంస్థలు, కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే జాబ్ మేళా ఒక గొప్ప అవకాశమని, దానిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని బొగ్గుల కుంటలో గల మెథడిస్ట్ కాలేజీలో అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మీ పై ఎన్నో ఆశలు పెట్టుకొని చదివించిన తల్లిదండ్రులకు, ఎంతో కష్టపడి మీరు చదివిన చదువుకు తగిన జాబ్ లభించినప్పుడే విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరింత గౌరవం, తృప్తి కలుగుతుందని పేర్కొన్నారు. చదువు పూర్తయిన అనంతరం ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగే అవసరం లేకుండా కళాశాలల్లోనే జాబ్ మేళాలు నిర్వహించి పలు సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా కృషిచేస్తున్న అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులను మంత్రి ప్రశంసించారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వస్తుందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే 1.35 లక్షల ఉద్యోగాల భర్తీ జరగ్గా, మరో 90వేల ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ల‌ను విడుదల చేస్తుందని వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అభివృద్ధి పనుల ఫలితంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద సంస్థలు ముందుకొస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అనువైన పరిస్థితులు ఉండటం, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చొరవతో పెద్ద ఎత్తున వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని, లక్షలాది మందికి వాటిల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. అనంతరం జాబ్ మేళాకు వచ్చిన వివిధ సంస్థల ప్రతినిధులకు మంత్రి సర్టిపికెట్ల‌ను అందజేశారు. అమెరికా తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మినేని మధు, లోహిత్ కుమార్, అపోలో హాస్పిటల్ ప్రిన్సిపాల్ డాక్టర్ సురేందర్ రెడ్డి, మెథ డిస్ట్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రభు, వివిధ సంస్థల ప్రతినిధులు సూర్య చంద్రారెడ్డి, రాకేష్రెడ్డి, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement