Sunday, May 12, 2024

హైదరాబాద్ లో ఆర్బిట్రేషన్ కేంద్రం.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హర్షం

హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం ఏర్పాటు తన కల అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నివాసంలో జరిగిన ఆ కేంద్రం ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎలాంటి వివాదాలు లేని వాతావరణంలో వ్యాపారం చేసుకునేందుకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతుంటారని, ఏ వివాదాలు లేకుండా ఈ ఆర్బిట్రేషన్ కేంద్రం చూస్తుందని ఆయన చెప్పారు. ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం జరగడం తెలంగాణకు చారిత్రక ఘట్టం అని అన్నారు. ఇక్కడ మౌలిక వసతులు, ఆర్థిక సహకారానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు. ఆర్బిట్రేషన్ కేంద్ర ఏర్పాటు బాధ్యతలను లావు నాగేశ్వరరావు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలోనే ఈ కేంద్రం ఏర్పాటుకు చట్టం వచ్చిందని గుర్తు చేశారు. ప్రపంచంలో తొలిసారిగా 1926లో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటైందని చెప్పారు. అయితే, మన దగ్గర ఆర్బిట్రేషన్ కేంద్రం లేకపోవడం వల్ల ప్రతిసారీ సింగపూర్, దుబాయ్ కు వెళ్లాల్సి వస్తోందని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఆ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆ బాధ తప్పుతుందన్నారు. కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందన్నారు. పరిశ్రమలకు ఆర్బిట్రేషన్ కేంద్రం పై అవగాహన కల్పించాలని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.

కాగా, ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు జడ్జిలు లావు నాగేశ్వర రావు, సుభాష్ రెడ్డి, తెలంగాణ హై కోర్టు సీజే హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డిలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండిః తెలంగాణలో కాంగ్రెస్ కు 72 సీట్లు పక్కా!

Advertisement

తాజా వార్తలు

Advertisement