Thursday, April 25, 2024

తెలంగాణలో కాంగ్రెస్ కు 72 సీట్లు పక్కా!

తెలంగాణలో పుర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ… అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకుంది. 2023 ఎన్నికల్లో జరిగే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా పలు విధాలుగా ఆందోళనలు, ఉద్యమాలు చేస్తోంది. ఈ క్రమంలో దళిత దండోరా అంటూ సభలు నిర్వహిస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే టీ.పీపీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి, రావిర్యాలలో సభలు నిర్వహించి.. కార్యకర్తల్లో విశ్వాసం నింపింది. వచ్చే నెలలో వరంగల్ లో మరో సభకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సైతం ఆహ్వానించింది. రాహుల్ రాకతో పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్తేజాన్ని నింపాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ పేరిట నిర్వహిస్తున్న సభలు విజయవంతం కావడంపై పార్టీ నాయకులు జోష్ లో ఉన్నారు. రెట్టింపు ఉత్సాహంతో మరన్ని కార్యక్రమాలకు ప్రణాళికలు రచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెరిగినట్లు అంచనా వేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు 72 సీట్లు వస్తాయని పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి రహస్యంగా ఓ సర్వే చేయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ కొత్త కమిటీపై కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. సమన్వయకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. కేసీఆర్ అవినీతి అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం పార్టీ నేతలకు పిలుపునిచ్చింది. త్వరలో హుజురాబాద్ ఉప ఎన్నికల జరగనున్న నేపథ్యంలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీనియర్ నేతలు విస్తృత చర్చలు జరుపుతున్నారు.

ఇది కూడా చదవండిః వైఎస్ షర్మిలకు బిగ్ షాక్.. వైఎస్ఆర్టీపీకి ఇందిరాశోభన్ రాజీనామా

Advertisement

తాజా వార్తలు

Advertisement