Monday, April 29, 2024

వరంగల్ సెంట్రల్ జైలు తరలింపు…?జైలు స్థానంలో హస్పిటల్ నిర్మాణం

వరంగల్ మహా నగర నడిబొడ్డున గల వరంగల్ సెంట్రల్ జైలు ను నగర శివారులోని ధర్మసాగర్ కు తరలించాలని తెలంగాణ సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ,రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు ఇప్పటికే ఆదేశాలు జారీచేసిన్నట్టు తెల్సింది. తరలించిన సెంట్రల్ జైలు స్థానంలో అన్నీ విభాగాలతో కూడిన సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ ను నిర్మించాలని కూడ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న వరంగల్ ఎం జి ఎం హాస్పిటల్ విస్తరణకు అవసరమైన స్థలం లేకపోవడంతో అన్నీ రకాల సూపర్ స్పెషలిటీ విభాగాలు ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అదీగాక తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన కాళోజీ హెల్త్ యూనివర్శిటీకి సొంత భవన నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. కనుక కాకతీయ మెడికల్ కాలేజీ నుండి వరంగల్ ఎం జి ఎం వరకు మొత్తం ఏరియాను మెడికల్ అండ్ హాస్పిటల్ జోన్ గా మార్చాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. వరంగల్ సెంట్రల్ జైలు ను నగర శివారులోకి మార్చాలని గత దశాబ్ద కాలంగా అనేక ప్రతిపాదనాలొచ్చాయి. జక్కులొద్ది ,కడిపికొండ లోని సర్కారు భూముల్లోకి తరలించాలన్న ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాళోజీ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవాల్సి రావడం, సదరు హెల్త్ యూనివర్సిటీని విద్యా కేంద్రంగా విరాజిల్లుతున్న వరంగాల్లో ఏర్పాటు చేశారు. అప్పటి నుండి కాళోజీ హెల్త్ యూనివర్శిటీని , వరంగల్ లోని కె.ఎం సి లో ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు. కాళోజీ హెల్త్ యూనివర్శిటీని కాకతీయ మెడికల్ కాలేజి దగ్గరలోనే ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కాగితాల్లోనే నలిగిపోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కరోన మహమ్మారి విజృంభనపై సమీక్షిస్తూ,హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ లోను అన్నీ రకాల వైద్య సేవలు అందించాలన్న నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే వరంగల్ నగర నడిబొడ్డున గల వరంగల్ సెంట్రల్ జైలును నగర శివారు ప్రాంతమైన ధర్మసాగర్ లో ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా పేరు గడించిన వరంగల్ ఎం జి ఎం హాస్పిటల్ విశిష్టతను కాపాడటంతో పాటు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గించాలని సి ఎం భావిస్తున్నట్టు అర్ధం అవుతోంది. కరోన కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో కరోన కట్టడి పై సి ఎం కేసీఆర్ సమీక్ష జరుపుతూ ,ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి.దయాకరరావు కూడ ప్రకటించారు. ఆదఫా వరంగల్ సెంట్రల్ జైలు తరలింపు ఖాయమన్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement