Tuesday, October 8, 2024

TS: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి.. మంత్రి గంగుల

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని… శారీరకంగా బాగుంటేనే పిల్లలు మానసికంగా రాణిస్తారని స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కేజీ నుండి పీజీ వరకు విద్యను ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. తాము చదువుకునే రోజుల్లో ఎటువంటి వసతులు ఉండేవి కావని.. చదవాలని తపన ఉన్నా చదివించే ప్రభుత్వాలు ఉండేవి కావన్నారు. ఆనాడు చదువు అంటే కేవలం ఉన్నత వర్గాల వారికే పరిమితం అనే పరిస్థితి ఉండేదని.. బీసీలు కేవలం కుల వృత్తులు చేసుకొని బతకాలనే వారని, కానీ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బీసీలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని అన్ని వసతులు కల్పించి విద్యను అందించడం జరుగుతుందన్నారు.

తెలంగాణ రాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 19పాఠశాలలు మాత్రమే ఉంటే… నేడు స్వరాష్ట్రంలో కేసీఆర్ 337 పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఉన్న కళాశాలలతో పాటు మరో 33 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్య అంటే బీసీ బిడ్డలు వెనుకబడిన పరిస్థితి నుండి ఉన్నత వర్గాల వారిని మించి ఫలితాలు వచ్చే పరిస్థితికి రావడాన్ని చూసి బీసీ బిడ్డగా గర్విస్తున్నానన్నారు. దేశం మొత్తం నేడు తెలంగాణ వైపు చూస్తోందని, కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలు నిజం చేయాలని, రాష్ట్రానికి తల్లిదండ్రులకు గొప్ప పేరు తేవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మానకొండుర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ గోపి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డ వేణి మధు, ఎం.జే.పీ స్కూల్స్ డిప్యూటీ కమిషనర్ తిరుపతి, ఎంపీపీ కేతిరెడ్డి వనిత, ప్రిన్సిపల్ విమల, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement