Sunday, April 28, 2024

MDK: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి.. మంత్రి పొన్నం

మెదక్ ప్రతినిధి /తూప్రాన్ : విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మెదక్ జిల్లా తుప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్ లో ఉన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తుప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్ లో 640 మంది విద్యార్థులు చదువుతున్నారు.. పాఠశాల ఆవరణ శుభ్రంగా లేకపోవడం, విద్యార్థుల హాస్టల్ వసతి క్లాస్ రూం గదులు ఒకే రూంలో ఉండడంతో అధికారులను పిలిపించి మాట్లాడారు.. ఆర్డీవో జయ చందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దిన్, తహశిల్దార్ విజయలక్ష్మిలను పిలిపించి స్కూల్ సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

స్కూల్ లో వాటర్ ప్లాంట్ మరమత్తుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా రూ.50వేలను పాఠశాల సిబ్బందికి అందించారు. స్కూల్ లో కాంపౌండ్ లేకపోవడంతో కుక్కలు వస్తున్నాయని సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.. విద్యార్థులు కొంత మంది చెట్ల కింద చదువుతుండడంపై ఆరాతీశారు… వెంటనే అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశంతో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్ కమిషనర్ రమణబాబుతో, మెదక్ కలెక్టర్ రాజర్షి షా తో ఫోన్ లో మాట్లాడారు. స్కూల్ లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. స్కూల్ లో విద్యార్థులకు బెడ్స్ ఏర్పాటు చేయాలని ఆర్డీవోకి ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూల్లో ప్లే గ్రౌండ్ లో ఆట వస్తువులతో పాటు ఓపెన్ జిమ్, పాఠశాల ఆవరణ సానిటేషన్ పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దిన్ ను ఆదేశించారు.

స్కూలుకు కాంపౌండ్ వాల్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని తహసీల్దార్ ను ఆదేశించారు.. డ్రింకింగ్ వాటర్ సౌకర్యంతో పాటు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంపై మున్సిపల్ కమిషనర్ దృష్టి సాధించాలని మంత్రి ఆదేశించారు. స్కూల్లో ప్రతి తరగతి గది తిరుగుతూ విద్యార్థులతో ముచ్చటించారు. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల సిబ్బంది సైతం విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి.. విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ భోజనం చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన సిబ్బందితో పాటు వాచ్ మెన్ లను సన్మానించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తుప్రాన్ ఆర్డీవో జయ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దిన్, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement