Wednesday, May 1, 2024

Exclusive – అరకులో ఆగమే! అధిష్టానానికి నిరసన సెగ

నేతల స్వయంకృతంపై జనం తిరుగుబాటు
నచ్చినోళ్లకే సీటు కోసం పార్టీ శ్రేణుల ఉడుంపట్టు
ప్రజల ఒత్తిడితో అగ్రనేతల ఉక్కిరి బిక్కిరి
ఎంపీ, ఎమ్మెల్యేకు సీటు గల్లంతు
వైసీపీ దుర్బేధ్య కోటలో చిత్ర విచిత్ర పరిస్థితి

(ఆంధ్రప్రభ స్మార్ట్ , విశాఖపట్టణం ప్రతినిధి ) ‍ ఆంధ్రావనిలో అద్బుత సౌందర్యవనం.. సహజ సంపదల సౌందర్య రాశి అరకులోయలో… శీతాకాలంలో లంబసింగి వాకిట్లో చలిమంటల నెగడు వెచ్చదనంలో మైమరచి పోయేందుకు తపించని పర్యాటకుడు ఉండడు. కానీ.. అక్కడ అమాయక గిరిపుత్రుల జీవన శైలి, రాజకీయ చైతన్య స్థితి గతులు నెమ్మదిగా మారిపోతున్నాయి. ఇక్కడి ప్రజలు నిజాన్ని నిగ్గదీస్తున్నారు. రాజకీయ ఆగడాలపై నిలదీస్తున్నారు. గిరిజనుల అసెంబ్లీ నియోజ వర్గంగా ఆవర్భవించిన పదహారేళ్ల అరకు పడుచులో రాజకీయ వేడి రాజుకుంది. తమకు నచ్చిన నాయకులనే బరిలోకి దించాలని పట్టుబట్టిన అరకు ప్రజల నిరసనలతో వైసీపీలో సెగ పుట్టింది. అంతే అధిష్టానం పునరాలోచనలో పడటమే కాదు… ఏకంగా అభ్యర్థులను మార్చక తప్పలేదు. పార్టీ శ్రేణులు పట్టుబడితే..అధిష్టానమూ తలవంచక తప్పదని అరకులోయ నిరూపిస్తోంది.

నేతల స్వయకృతం…
అరకు సిట్టింగ్‌ ఎంపీ గొడ్డేటి మాధవి స్వయం కృతంతో ఏకంగా వైసీకి చికాకులు తప్పలేదు. పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలయిక అరకు పార్లమెంటు ఎంపీగా మాధవి తిరుగులేని వ్యతిరేకతను మూటగట్టుకోవటంతో… ఆమెను అరకు అసెంబ్లీకి బదిలీ చేసినట్టు వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అంతే స్థానికత సమస్య తలెత్తింది. వాస్తవానికి అరకు అసెంబ్లీ స్థానం వైసీపీకి పెట్టని కోట. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణపైనా ఆరోపణ బాణాలు దూసుకు వచ్చాయి. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఎదురుతిరిగారు. ఇలాంటి స్థితిలో మళ్ళీ ఎంపీగామాధవి గెలవటం కష్టమని అంచనా వేసిన అధిష్టానం అరకు అసెంబ్లీకి మాధవిని పరిమితం చేసి.. సిట్టింగ్ ఎమ్మెల్యే పాల్గుణను పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకుంది. అనేక తర్జనభర్జనల అనంతరం మాధవికి అరకులోయను అప్పగించింది. సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అరకు ఎమ్మెల్యే పాల్గుణ సీటు కోల్పోయారు. మార్పులు చేర్పుల్లో తనకు పాడేరు సీటు దక్కుతుందని పాల్గుణ ఆశించినా.. చివరకి ఆశాభంగం తప్పలేదు. అరకు ఎమ్మెల్యేగా గొడ్డేటి మాధవిని ప్రకటించిన రోజు నుంచే స్థానిక వైసీపీ నేతలు ఆందోళన బాట పట్టారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ల మొదలు.. వైసీపీ క్యాడర్ మొత్తం మాధవిని తప్పించాలని డిమాండు చేశారు. మాధవి తప్ప.. స్థానికుల్లో ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా.. తాము గెలిపించుకుంటాని స్థానికుల పట్టుపట్టటంతో వైసీపీ పెద్దలు తలూపక తప్పలేదు.

అధిష్టానం వెనకడుగు
వైసీపీ అధిష్టానానికి అరకు స్థానిక సెగ తగిలిందని రాజకీయ విశ్లేషకుల అంచనా. అయిదవ జాబితాలో అరకుఅభ్యర్థి మాధవి తొలగించక తప్పలేదు. హుకుంపేట జడ్పీటీసీ రేగం మత్స్యలింగానికి అవకాశం కల్పించారు.మాధవిపై వ్యతిరేకతను నివారించటం, ఆపై ప్రతిపక్షం నిలబెట్టే వ్యక్తికి ధీటైన వ్యక్తిని ఢీకొనే శక్తి మత్స్యలింగంకే ఉందని అధిష్టానం భావించింది. రేగం మత్స్యలింగం స్థానికుడు. కొండ దొర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రేగం ఎంపికపై స్థానిక నేతలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే పాల్గుణ కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పాల్గుణ.. సీటు కోల్పోయినా అధిష్టానంకు మరోసారి పరిశీలించాలని చెప్పారట. అంతేగానీ.. పార్టీపై గానీ.. అధినేతపై కానీ విమర్శలు చేయలేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎంపీ మాధవిని అరకు ఎమ్మెల్యేగా ప్రకటించిన తర్వాత ప్రజలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే పాల్గుణపైనా వ్యతిరేకత రావటంతో.. పాల్గుణ ఆ నిర్ణయం తీసుకున్నారని సమాచారం ఎమ్మెల్యే అభ్యర్థిగా రేగం మత్స్యలింగం పేరును సిట్టంగ్ ఎమ్మెల్యే పాల్గుణనే సూచించినట్లు తెలుస్తోంది. గతంలో ఇద్దరూ కలసి పనిచేసిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది ఉండదనే పాల్గుణ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.మత్స్యలింగం గెలిస్తే.. నియోజకవర్గంలో తన పరపతికి ఎలాంటి ఢోకా ఉండదని భావించినట్లు తెలుస్తోంది.

ఎంపీ అంతర్మథనం
ఎంపీ గొడ్డేటి మాధవి మాత్రం..వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికురాలు కాకపోవడం, ఐదేళ్లు ఎంపీగా ఉన్న కనీసం అరకులో క్యాంపు కార్యాలయం కూడా ప్రారంభించక పోవటంతో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకతను మాధవి మూటగట్టుకున్నారనే ఆరోపణ ఉంది. దీనికి తోడు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధీ లేదు, ఎంపీ భర్త జోక్యం పెరగటంతో మాధవికి ఇబ్బంది తప్పలేదని విశ్లేషకుల అంచనా. వైసీపీ అధిష్టానం నుంచి.. తనకు స్పష్టమైన హామీ రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి కూడా ఆమె సిద్ధమవుతోన్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

వైసీపీకే గిరిజనం పట్టం
అరకు పార్లమెంటు స్థానంలో వైసీపీ తిరుగులేదు. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి టీడీపీని జనం తిరస్కరిస్తూనే ఉన్నారు. ఈ ఎంపీ స్థానంలోని సాలూరు, కురుపాం అసెంబ్లీ నియోజక వర్గాల్లోనే 2004లో టీడీపీ గెలిచిందేగానీ, ఎంపీ స్థానంలో ఓడిపోక తప్పలేదు. ఇక అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకే జనం పట్టం కట్టారు. 2009లో మాత్రం టీడీపీ అభ్యర్థి సివేరీ సోమేశ్వరరావు ను అరకు ప్రజలు గెలిపించారు. ఆ తరువాత టీడీపీ ఊసే లేదు. వైసీపీ తరువాత స్వతంత్రం అభ్యర్థులకే గిరిజనులు ప్రాధాన్యం ఇచ్చారు. 2014లో కుంభ రవిబాబు ( 25,789 ఓట్లు), 2019లో సియ్యారి దొన్ను దొర (27,660 ఓట్లు) అనే స్వతంత్ర అభ్యర్థులకు జనం హారతి పట్టారు. ఈ సారి ఎట్టి పరిస్థితిలోనూ అరకులో జెండా ఎగురవేయాలని టీడీపీ ఉర్రూతలూగుతోంది. ఇప్పటికే అరకు నియోజకవర్గం టీ టీడీపీ ఇంచార్జ్, ఎమ్మెల్యే అభ్యర్దిగా ర సియ్యారిదొన్ను దొర పేరును చంద్రబాబు ప్రకటించారు. కొండదొర సామాజిక వర్గానికి చెందిన దొన్ను దొర2019లో టీడీపీటిక్కెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి కిడారి శ్రవణ్‌ను వెనక్కి నెట్టి రెండోస్థానంలో నిలిచారు. ఈ లెక్కలను అంచనా వేసుకునే..దొన్నుదొరకు టిక్కెట్ ను ఖరారు చేసిందనే గుసగుసలూ ఉన్నాయి. దీంతో బలమైన అభ్యర్థి కోసం చూసి.. టీడీపీకి పోటీగా అదే సామాజికి వర్గానికి చెందిన మత్స్యలింగానికి వైసీపీ అవకాశం కల్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement