Thursday, May 2, 2024

Spl Story – గొత్తి కోయ‌ల‌ ఉపాధి వేట! రైతు కూలీలుగా గిరిపుత్రులు

దండకారణ్యం వీడి జనారణ్యంలోకి
మిర్చి కోతలకు తరలివస్తున్న గిరిపుత్రులు
ఏజెన్సీలో కూలీ పనులకు వీరే దిక్కు
కొండ కోనలను వీడుతున్న కోయబిడ్డలు
రైతన్నలకు అన్ని పనుల్లో వెనుదన్ను
కూలీల కొరత తీరుస్తున్న అడవి బిడ్డలు

(ప్రభ న్యూస్, కుక్కునూరు) – ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల పేరు చెప్పగానే అందరి మదిలో దండకారణ్యం.. విప్పపూల గమ్తత్తు , ఆకాశాన్ని చూసే వృక్షరాజాలు గుర్తుకురావటం సహజం. ఇక్కడి సజీవ చిత్రంలో కనిపించే గొత్తికోయలు అసాధారణ గిరిపుత్రులే. వందల మైళ్లు నడుస్తారు. గమ్యాన్ని చేరుతారు. బస్సు కనపడినా ఎక్కరు, చేతిలో చిల్లిగవ్వ కనపడదు. చలికాలంలో అడవిలో ఆకులు రాలే తరుణంలో.. ఆకలి తీర్చుకోవటానికి మైదాన ప్రాంతానికి వస్తుంటారు. ఎక్కడ బువ్వ దొరుకుతుందో.. అక్కడ శ్రమిస్తారు. కారుచౌకగా లభించే ఈ గొత్తికోయ కూలీల కోసం మైదానంలో రైతులు ఎదురు చూస్తుంటారు. ఏలూరు జిల్లా ఏజెన్సీలో మిరప రైతులకు గొత్తికోయలంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో అధికంగా రైతులు మిర్చి సాగు చేస్తారు. మొక్క నాటు నుంచి కోత దశ వరకు మిర్చి తోటను కంటికి రెప్పలా కాపాడతారు. కానీ మిర్చి కోతలకు పొరుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో గుత్తికోయలు ఏటా జనవరిలో తరలివస్తారు. ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గ‌ఢ్‌ రాష్ట్రాల్లో కరువు కాటేయడంతో.. వేల కుటుంబాలు పిల్లా, పెద్దలతో ఉపాధి కోసం కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు వలస వచ్చి మిర్చి కోతలు పూర్తి అయ్యేవరకు ఇక్కడే ఉంటారు.

చిన్న చిన్న గుడిసెల‌లో..
వాగులు, వంకలు వద్ద చిన్న.. చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకొని గొత్తికోయ‌లు తలదాచుకుంటారు. రాత్రి వేళల్లో ఆడుతూ.. పాడుతూ కాలం గడుపుతారు. తెల్లవారుజామున మిర్చి కోతలకు సద్ది బువ్వతో బయలుదేరి వెళ్లి.. మిర్చి కోత కాగానే సద్ది తింటారు. సాయంత్రం 4 గంటలకు తాత్కాలిక నివాసాల వద్దకు వెళ్లి ఆహార పదార్థాలను తయారుచేసి సమష్టిగా కూర్చోని తింటారు. కాగా, రాతి బండపై పండు మిర్చి, చింతపండుతో తయారు చేసిన పచ్చడిని తింటారు. వలస గొత్తికోయలు చేసే పనిలో నిజాయితీ ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రమే ఆశిస్తారు. అలసట అనేది వారికి తెలియదు. వంట వార్పు, దప్పిక తీర్చుకోవటానికి వాగుల్లో నీళ్లనే వాడతారు. ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారుతున్నా ఈ అడవి బిడ్డల జీవితాల్లో మార్పు అనేది లేదు. వెలుగు కనిపించడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement