Friday, May 3, 2024

త్వరలో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారుతుంది.. దేశాన్ని ఆకర్షించేలా కార్యక్రమాలు: ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశ తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మొత్తం మారిపోతుందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 2, 3వ తేదీల్లో బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై చర్చించడానికి ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీకి ఆయన ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ నేతలు సమావేశమయ్యారు. ఇందులో లక్ష్మణ్‌తో పాటు ఎంపీ, బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్, సీనియర్ నేతలు ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

గతంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించిన నేతలతో స్టీరింగ్ కమిటీ కలిసి సమావేశ ఏర్పాట్లపై చర్చించింది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై కేంద్ర నేతలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశం అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ… 20 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ సమావేశాలను ప్రత్యేకంగా పెద్దఎత్తున నిర్వహించేందుకు రాష్ట్ర కమిటీ పని చేస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.

మినీ భారత్‌గా పేరొందిన హైదరాబాద్‌లో ఉన్న వివిధ వర్గాల వారందరితో కలిపి ఓ సమ్మేళనాన్ని నిర్వహించాలనుకుంటున్నట్టు లక్ష్మణ్ వెల్లడించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దేశం మొత్తాన్ని ఆకర్షించేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించబోతున్నామని ఆయన వివరించారు. కాకతీయ సామ్రాజ్యం, నిజాం పాలనపై పోరాడిన యోధుల ఫొటోలతో ఎగ్జిబిషన్లు పెడుతున్నామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ వాస్తవ పరిస్థితులు దేశం కళ్లకు కడతామన్నారు. పది లక్షల మంది హాజరయ్యే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికీ ఘన స్వాగతం పలుగుతామని లక్ష్మణ్ వివరించారు.

- Advertisement -

అధికారం మాదే..

కేసీఆర్ ప్రభుత్వం, కుటుంబంపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ అమరవీరుల పక్కనపెట్టి తెలంగాణ ద్రోహులను కేసీఆర్ పక్కన పెట్టుకున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తోడుదొంగల్లా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. జూలైలో నిర్వహించే కార్యవర్గ సమావేశాల తర్వాత తప్పకుండా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement