Monday, April 29, 2024

సబ్ స్టేషన్ లో సమస్య వస్తే అధికారులకు మెస్సేజ్.. స్కాడాతో విద్యుత్ సమస్యలకు పరిష్కారం..

ప్ర‌భ‌న్యూస్ : విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే వినియోగదారుడు ఫిర్యాదు చేసే వరకు ఏఈకి తెలిసేది కాదు. నాలుగైదు గంటలైనా కరెంట్‌ పంపిణీ బంద్‌ అయినా ఎస్‌ఈ దృష్టికి వెళ్లేది కాదు. ఇందుకు భిన్నంగా సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డాటా అక్వైజేషన్‌ (స్కాడా) పరిధిలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలో సమస్య వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం వెళుతోంది. కార్యాలయం నుంచి క్షేత్ర స్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేయవచ్చు. అయితే ఈ వ్యవస్థ నేటికి నగరంలోని విద్యుత్‌ ఉప కేంద్రాలకే పరిమితమైంది. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ విస్తృతంగా విస్తరిస్తుండటంతో విద్యుత్‌ అవసరాలు అంతే వేగంగా పెరుగుతున్నాయి. గృహ నిర్మాణం, కార్యాలయాలు, నూతన పరిశ్రమలు వస్తుండటంతో.. నగర శివార్లలో పెద్ద ఎత్తున 33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు. 2014కు ముందు 333 ఉప కేంద్రాలుండగా .. రాష్ట్ర విభజన తర్వాత వీటి సంఖ్య 476కి చేరింది వీటిలో ప్రస్తుతం 228 విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు మాత్రమే స్కాడాతో అనుసంధానం చేశారు.

2007లో ఆర్‌-ఏపీడీఆర్‌పీ పథకం కింద వీటిని చేపట్టారు. ఆ తర్వాత కొత్తగా 15 నుంచి 20 విద్యుత్‌ ఉప కేంద్రాలను చార్జ్‌ చేశారు. వీటన్నింటిని కలుపుకుంటే మొత్తం 248 విద్యుత్‌ ఉప కేంద్రాలను స్కాడా పరిధిలోకి తీసుకురావాల్సి ఉంది. వీటన్నింటిని స్కాడా పరిధిలోకి తీసుకు రావాలంటే అధిక మొత్తంలో విద్యుత్‌ పంపిణి (డిస్కంలు) సంస్థలు నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అప్పుల భారంతో డిస్కలు సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో సబ్‌స్టేషన్నింటిని స్కాడా పరిధిలోకి తీసుకొస్తారా..? అనేది స్పష్టత రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఆధిత్య పథకం’లో భాగంగా రాష్ట్రానికి వచ్చే నిధుల ద్వారా మిగిలిన సబ్‌స్టేషన్‌ను స్కాడా పరిధిలోకి తీసుకొచ్చేందుకు డిస్కంలు ప్రణాళికలను రూపొందించాయి. తొలుత జీహెచ్‌ఎంసీ పరిధిలో మిగిలిన 122 సబ్‌స్టేషన్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

స్కాడాతో ప్రయోజనాలు..* విద్యుత్‌ ఉప కేంద్రాలు, పీడర్లు అటోమేషన్‌తో అంతరాయాలు గణనీయంగా తగ్గుతాయి.
* విద్యుత్‌ లైన్లు, పీడర్లు ట్రిప్‌ అయితే వెంటనే సబ్‌స్టేషన్‌ అలారం మోగుతుంది. స్కాడాలోనూ తెలుస్తుంది.
* అంతరాయాలకు సంబంధించి స్కాడా నుంచి ప్రతి రోజు ఉదయం ఆయా సర్కిళ్ల ఎస్‌ఈలకు సమాచారం వెళ్లుతుంది. దీంతో ఎప్పటికప్పుడు సమీక్ష చేయడానికి అవకాశం ఉంది.
* వినియోగదారులకు కూడా విద్యుత్‌ సరఫరాలో అంతరాయానికి సమంధించిన పూర్తి సమాచారం తెలియజేయవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement