Sunday, May 5, 2024

నిర్దిష్ట ప్రణాళికతో సాఫీగా ధాన్యం సేకరణ ప్రక్రియ : నిజామాబాద్ కలెక్టర్

నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ 12 (ప్రభ న్యూస్) : ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సాఫీగా నిర్వహించేందుకు గాను సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, ఐకేపీ సీసీలు, రైస్ మిల్లర్లతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంట విక్రయం విషయంలో రైతు ఏ దశలోనూ ఇబ్బందులకు గురికాకుండా, పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిష్టితుల్లోనూ రైతులు నష్టపోకుండా పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయిలో మద్దతు ధర అందేలా చూడాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఉందన్నారు.
గత ఏడాది ఇదే సీజన్ లో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఈసారి సుమారు 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సిన అవసరం ఉందని అంచనా వేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా నెలకొల్పనున్న 467 కేంద్రాల ద్వారా ప్రతిరోజూ సగటున 18 వేల నుండి 20 వేల మెట్రిక్ టన్నుల చొప్పున ధాన్యం కొనుగోలు చేసినట్లయితేనే నిర్ణీత గడువులోపు నిర్దేశిత లక్ష్యం మేరకు ధాన్యం సేకరణ చేయగల్గుతామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సంబంధిత శాఖల అధికారులందరూ సమిష్టిగా, సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. రైతుల నుండి ఏ చిన్న ఫిర్యాదు సైతం రాకుండా చూసుకోవాలని, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు.

రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని నిలువ చేసేందుకు అవసరమైన గోడౌన్లు, స్థలాలను తక్షణమే సిద్ధం చేసుకోవాలని సూచించారు. వర్షాల వల్ల ధాన్యం పాడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను రెండుమూడు రోజుల్లో అన్ని కేంద్రాలకు సమకూరుస్తామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, ఏ చిన్న ఇబ్బందికి సైతం తావులేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీ ఎస్ ఓ చంద్రప్రకాశ్, డీసీఓ సింహాచలం, డీఏఓ తిరుమల ప్రసాద్, డీటీసీ వెంకటరమణ, డీఆర్డీఓ చందర్, మెప్మా పీ.డీ రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement