Sunday, April 28, 2024

TS | కేసీఆర్​ ఫ్యామిలీకి గుడ్​బై చెప్పండి: కేఏ పాల్​

‌‌‘‘కేసీఆర్​ కుటుంబానికి గుడ్​బై చెప్పండి.. అభివృద్ధి కావాలంటే ప్రజాశాంతి పార్టీతో కలిసి రండి’’ అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. సంగారెడ్డిలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై పలు విమర్శలు, ఆరోపణలు చేశారు. బుద్ది ఉన్నోడెవడూ మళ్లీ బీఆర్​ఎస్​కు ఓటు వేయడని పాల్​ ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్​ఎస్​ కుమ్మక్కు అయ్యాయని, ఢిల్లీ లిక్కర్​ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవడానికి అదే కారణమని ఆరోపించారు.

– ఉమ్మడి మెదక్​, ప్రభ న్యూస్​ బ్యూరో

సీఎం కేసీఆర్​ కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురును అరెస్ట్ చేయకపోతే 40 సీట్లు ఇస్తానని బీజేపీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఆ ఒప్పందంతోనే అరెస్ట్ ప్రక్రియ ఆగిపోయిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని కేఏ పాల్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్లేవర్డ్ హోటల్ లో గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 20న సదాశివపేట పాల్ ఛారిటీ సిటీలో సంగారెడ్డి అభివృద్ధి గురించి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 83 గ్రామాల్లో 10 వేల మంది, సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోనే 30 వేల మంది నిరుద్యోగులు ఉన్నారన్నారు. 1200 ఎకరాల విస్తీర్ణంలో తన ఛారిటీ సిటీ నిర్మించి ఎందరికో భవిష్యత్తు ఇచ్చానని గుర్తు చేశారు.

- Advertisement -

అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డికి రూ. 20 వేల కోట్లు ఇవ్వనందుకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో ధర్నాలు చేయించి మూసి వేయించారని ఆరోపించారు. వైఎస్ తొత్తుగా మారిన జగ్గారెడ్డి ఛారిటీ సిటీ నుంచి వెయ్యి మంది పిల్లల భవిష్యత్తు నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాక జగ్గారెడ్డి ఏం చేశారని పాల్ సూటిగా ప్రశ్నించారు. 1000 పడకల ఆసుపత్రి నిర్మించి ఛారిటీ ద్వారా ఉచిత హెల్త్ కార్డులు ఇచ్చి వైద్య సేవలు అందించానన్నారు.

అభివృద్ధి కావాలంటే ప్రజాశాంతి పార్టీలోకి రావాలి..

తొమ్మిదేళ్లుగా లేని ప్రేమ సడన్ గా పుట్టుకొచ్చింది.. ఎన్నికల కోసమే కేసీఆర్ డ్రామాలు.. డబ్బులు తీసుకుని BRS పార్టీలో చేరుతావా? అభివృద్ధి కోసం ప్రజాశాంతి పార్టీలో చేరుతావో తేల్చుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కేఏ పాల్​ సూచించారు. తనతో పెట్టుకున్న రాజశేఖర్ రెడ్డి ముక్కలు..ముక్కలు అయ్యారన్నారు. తనని సీఎం చేస్తే ప్రతి గ్రామానికి రూ. 50 కోట్లు, మున్సిపాలిటీకి రూ.200 కోట్లు స్వంతగా ఇచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఉపాధి హామీతో ముందుకు వస్తున్నానని పాల్ వెల్లడించారు. గద్దర్ బతికున్నప్పుడు సీఎం కేసీఆర్ సమయం ఇవ్వలేదని, చనిపోయాక ఓట్ల కోసం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారని ఘాటు విమర్శలు చేశారు.

మంత్రి మల్లారెడ్డి భజన ఆపితే బాగుంటుంది..

సీఎం కేసీఆర్ వద్ద రూ.5 లక్షల కోట్లు ఉన్నాయన్నారు. ధరణి ద్వారా రూ.12 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరిస్థితి ఎమిటని ప్రశ్నించారు. ప్రభాకర్ తన పార్టీలోకి వస్తే ఏటా అభివృద్ధికి రూ.కోటి ఇస్తానని చెప్పారు. కేటీఆర్​కు తప్ప ఎవరికీ ఐటీ నాలెడ్జ్ లేదన్నారు. మంత్రి మల్లారెడ్డి కేసీఆర్ భజన ఆపితే బాగుంటుందని చురకలు అంటించారు. మోదీ, రాహుల్ గాంధీ, కేసీఆర్ కుటుంబాన్ని ఢీ కొనే సత్తా తనకు ఉందని పాల్ ధీమా వ్యక్తం చేశారు. మోడీ అప్పుల దేశంగా మార్చారని, అయితే తన జీవితాన్ని నాశనం చేసింది జగ్గారెడ్డేనన్నారు. చారిటీని మూసివేసి పిల్లల కడుపు కొట్టాడని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. పీసీసీ చీఫీ రేవంత్ రెడ్డికి అస్సలు క్యాడర్ లేదని పాల్ అన్నారు.

జగ్గారెడ్డి బిగ్​ ఆఫర్​.. ప్రజాశాంతిలోకి ఆహ్వానం

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో తాను 1,200 ఎకరాల్లో చారిటీ సిటీ నిర్మించానని, దాన్ని చూసి దేశవిదేశాల ప్రతినిధులు ఆశ్చర్యపోయారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ అన్నారు.  అయితే, అప్పట్లో తాను వైఎస్సార్ కు డబ్బులు ఇవ్వలేదంటూ ఆ చారిటీ సిటీని ఎమ్మెల్యే జగ్గారెడ్డి మూయించారని ఆరోపించారు. చారిటీ సిటీ విషయంలో జగ్గారెడ్డి చాలా గొడవ చేయించారన్నారు. అయినా తాను జగ్గారెడ్డిని ఏనాడూ శపించలేదని తెలిపారు.

జగ్గారెడ్డిని ఇప్పటివరకు క్షమించానని, ఇక క్షమించబోనని కేఏ పాల్ స్పష్టం చేశారు. ఆయనను తమ ప్రజాశాంతి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నానని, సంగారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. రూ.1000 కోట్లు ఇచ్చే బీఆర్ఎస్ లో చేరతారో, అభివృద్ధి చేసే ప్రజాశాంతి పార్టీలో చేరతారో జగ్గారెడ్డి తేల్చుకోవాలని స్పష్టం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందని కేఏ పాల్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement