Thursday, May 2, 2024

TS | ధ‌ర‌లు పెంచుడేమో బీజేపీ ప‌ని.. పేద‌ల‌కు నిధులు పంచుడేమో కేసీఆర్ ప‌ని: మంత్రి హ‌రీశ్‌రావు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వంపై మంత్రి హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. ధ‌ర‌లు పెంచుడేమో బీజేపీ ప‌ని.. పేద‌ల‌కు నిధులు పంచుడేమో కేసీఆర్ ప‌ని అని హ‌రీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో 30ప‌డ‌క‌ల ఆస్ప‌త్రిని మంత్రి సబితా ఇంద్రారెడ్డితో క‌లిసి ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో హ‌రీశ్‌రావు ప్ర‌సంగించారు.

– వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌

సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ‌గా మారింద‌ని మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. ఒక‌ప్పుడు స‌ర్కార్ ద‌వాఖానాల్లో మందులు దొర‌క‌ని ప‌రిస్థితి ఉండేద‌ని, తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన కొత్త‌లో రాష్ట్రంలో 17 వేల ప‌డ‌కల ఉంటే.. ఇప్పుడు 50 వేల ప‌డ‌క‌లు ఉన్నాయ‌న్నారు. సీఎం కేసీఆర్ వాటిని మూడింత‌లు పెచార‌న్నారు. నాడు వైద్యాన్ని గాలికి వ‌దిలేశారని, సీఎం కేసీఆర్ వైద్యం, విద్య ప్ర‌తి ఒక్క‌రికి అందించాల‌నే సంక‌ల్పంతో ఉన్నార‌న్నారు. మంత్రి స‌బిత నేతృత్వంలో విద్యా రంగాన్ని బ‌లోపేతం చేస్తున్నామ‌ని, మ‌న ఊరు – మ‌న బ‌డి ప్రారంభించుకున్నాం. అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఇంగ్లీష్ మీడియం ప్ర‌వేశ‌పెట్టాం అన్నారు.

నాడు 3.. నేడు 33..
నాడు తెలంగాణ‌లో మూడు మెడిక‌ల్ కాలేజీలు ఉండే.. ఉస్మానియా, గాంధీ, వ‌రంగ‌ల్‌లో ఎంజీఎం అని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. ఇవాళ కేసీఆర్ నాయ‌క‌త్వంలో 33 జిల్లాల‌కు 33 ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలు వ‌స్తున్నాయి. మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి మెడిక‌ల్ కాలేజీ మంజూరు చేశాం. ఎన్నిక‌లు రాగానే ఢిల్లీలో టికెట్ ఫైన‌ల్ కాగానే మ‌న వ‌ద్ద‌కు కొంద‌రు వ‌స్తారు. ఎన్నిక‌లు ఉన్న‌ప్పుడు వ‌చ్చే నాయ‌కులు కొంద‌రైతే.. ఎల్ల‌వేళ‌లా ప్ర‌జ‌ల మధ్య ఉండే నాయ‌కురాలు స‌బిత ఇంద్రారెడ్డి. ఓట్లు ఉన్నా లేక‌పోయినా నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటుంది. నిరంత‌రం ప్ర‌జ‌ల గురించి ఆలోచిస్తుంటారు. స‌బితా ఇంద్రారెడ్డి చొర‌వ‌తో మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో 550 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి వ‌స్తుంది. పెద్ద పెద్ద స‌ర్జ‌రీల నుంచి చిన్న చిన్న ఆప‌రేష‌న్ల దాకా ఇక్క‌డ జ‌రుగుతాయి. అలాంటి మెడిక‌ల్ కాలేజీ వ‌చ్చింది. వారం ప‌ది రోజుల్లో మెడిక‌ల్ కాలేజీకి శంకుస్థాప‌న చేయ‌బోతున్నాం. నాగిరెడ్డిపేట వ‌ద్ద ఐటీ ట‌వ‌ర్ తీసుకొచ్చేందుకు య‌త్నిస్తాం. కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. బైపాస్ రోడ్డు విష‌యాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి, త్వ‌ర‌లోనే మంజూరు చేయిస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

24 గంట‌ల క‌రెంట్ కావాలంటే కేసీఆర్‌కు ఓటేయాలి..
మూడు గంట‌ల క‌రెంట్ చాల‌ని ఒకాయ‌న మాట్లాడుతుండు అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. మూడు గంట‌ల‌కు మూడు ఎక‌రాలు పారుత‌ద‌ట‌. 24 గంట‌ల క‌రెంట్ దండ‌గ అంట‌డు. వ్య‌వ‌సాయం దండ‌గ అని చంద్ర‌బాబు అన్నాడు. ఇవాళ రైతులుగా మీరు ఆలోచించాలి. మూడు గంట‌ల క‌రెంట్ కావాలంటే కాంగ్రెస్‌కు ఓటేయాలి.. 24 గంట‌ల క‌రెంట్ కావాలంటే కేసీఆర్‌కు ఓటేయాలి. మ‌ధ్య‌లో బీజేపీ వ‌చ్చి మీట‌ర్ పెట్టండి అంటున్నారు. ఈ ప‌ని మ‌నం చేయ‌నందుకు రూ. 35 వేల కోట్లు ఆపారు. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి తిమ్మాపూర్‌ను ద‌త్త‌త తీసుకుని ఒక్క రూపాయి ప‌ని కూడా చేయ‌లేదు. మాది ఉచిత విద్యుత్ విధానం.. మీట‌ర్లు పెట్టం.. రైతుకు 24 గంట‌ల ఉచిత విద్యుత్ ఇస్తామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేయ‌డంతో రూ. 35 వేల కోట్లు ఆపేశారు. బీజేపీ నాయ‌కులు రైతుల‌కు శాపంగా మారారు. మూడు గంట‌ల క‌రెంట్ చాల‌ని పాపం లాగా కాంగ్రెసోళ్లు మారారు. దీపం లాంటి కేసీఆర్ ఉండ‌గా.. ఈ పాప‌పు, శాపపు బీజేపీలు అవ‌స‌ర‌మా రైతులు సోద‌రులు ఆలోచించాలి. రైతుల కోసం కేసీఆర్.. ఉచిత క‌రెంట్, రైతుబంధు, రైతుబీమా అమ‌లు చేస్తున్నారు. రూ. 20 వేల కోట్ల రుణ‌మాఫీ చేశారు. నిన్న‌టి వ‌ర‌కు రూ. 99,999 వ‌ర‌కు రుణ‌మాఫీ అయిపోయింది. వ‌చ్చే 15 – 20 రోజుల్లో రైతుల‌ను రుణ‌విముక్తులు చేస్తాం అని మంత్రి ప్ర‌క‌టించారు.

మ‌హిళ‌ల‌కు వ‌డ్డీ లేని రుణాలు విడుద‌ల చేస్తాం..
బీజేపీ హ‌యాంలో గ్యాస్ ధ‌ర‌లు పెరిగాయ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. నాడు 400 ఉన్న సిలిండ‌ర్‌ను 1200కు పెంచిండు. ధ‌ర‌లు పెంచుడేమో బీజేపీ ప‌ని.. పేద‌ల‌కు నిధులు పంచుడేమో కేసీఆర్ ప‌ని. ఆడ‌పిల్ల‌ల పెళ్లిళ్ల‌కు క‌ల్యాణ‌ల‌క్ష్మి, కాన్పుకు వెళ్తే కేసీఆర్ కిట్ అందిస్తున్నాం. అభ‌య‌హ‌స్తం డ‌బ్బులు వారం రోజుల్లో జ‌మ చేస్తాం. మ‌హిళ‌ల‌కు వ‌డ్డీలేని రుణం డ‌బ్బులు.. రుమాఫీ పూర్త‌యిన త‌ర్వాత ద‌శ‌ల‌వారీగా ద‌బ్బులు విడుద‌ల చేస్తాం. ఈ విధంగా పేద‌లు, మ‌హిళ‌ల పక్షాన అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేశాం. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను ఎంతో బ‌లోపేతం చేశాం. డాక్ట‌ర్లు, స్టాఫ్ న‌ర్సుల‌ను నియామ‌కం చేసుకున్నాం. ప్ర‌భుత్వ వైద్య వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తున్నామ‌ని మంత్రి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement