Thursday, May 2, 2024

మహిళల సమస్యలకు పరిష్కారం చూపేదే సఖి : మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు : మహిళల సమస్యల పరిష్కారం కోసం ఒన్ స్టాప్ సెంటర్ గా పని చేస్తున్న సఖీ కేంద్ర శాశ్వత సొంత భవనాన్ని ఈరోజు ములుగు జిల్లాలో రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. రూ. 49 లక్షలతో నిర్మించిన ఈ భవనంలో మహిళలకు అత్యవసర పునరావాసం కోసం గదులు, పోలీస్ సాయం, న్యాయ సాయం, వైద్య సాయం వంటి అన్ని వసతులు ఈ భవనంలో ఉంటాయని చెప్పారు. దీంతో పాటు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గ్రామీణ రవాణా సదుపాయం పథకం (రూరల్ ట్రాన్స్ పోర్టేషన్ స్కీం) కింద కోటి రూపాయల విలువైన 10 రవాణా వాహనాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టర్ ను, మహిళా హెల్ప్ లైన్ 181 పోస్టర్ ను ఆవిష్కరించారు. అంగన్ వాడీలకు చీరలు పంపిణీ చేశారు.
అక్కడే నిర్మాణం జరుగుతున్న ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ పనులను పరిశీలించారు. అనంతరం చల్వాయి క్రాస్ రోడ్ నుంచి లక్నవరం వరకు రోడ్డు అభివృద్ధి కోసం కోటిన్నర రూపాయల పనికి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏపీఓ వసంత్ రావు, ఈఈ హేమలత, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, జడ్పీ సీఈవో ప్రసూన, జడ్పీటీసీలు, ఎంపీపీ, ఎంపీటీసీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement