Monday, April 29, 2024

RR: అంజన్నకే మళ్లీ షాద్‌నగర్‌ బీఆర్ఎస్ టికెట్

షాద్ నగర్, ఆగస్టు 21, ప్రభ న్యూస్ : షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంత ఇష్టమో వేరేగా చెప్పనక్కర్లేదు. ఉద్యమం మొదటి రోజుల నుండి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో ఆయనకు ఉన్న అనుబంధం గొప్పదని కార్యకర్తలు అంటున్నారు. మరోసారి ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ పై విశ్వాసం ఉంచి నాలుగోసారి టికెట్టును కేటాయించడం విశేషం. షాద్ నగర్ అసెంబ్లీలో తిరుగులేని నేతగా అవతరించిన “అంజయ్య యాదవ్ సైన్యానికి” పూర్తి మద్దతు ప్రకటించారు. టికెట్ల జాబితాలో షాద్ నగర్ ఎమ్మెల్యే పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కే టికెట్ వరించడంతో నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. మొదటి నుండి టికెట్ అంజయ్య యాదవ్ నే వరిస్తుందన్నది వాదన.


సర్వేల నేపథ్యంలో గెలుపునకు ఎక్కువ అవకాశాలున్న నాయకుడిగా అంజయ్యకు పేరుంది. ఇదే టికెట్లు ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే చల్లపల్లి ప్రతాప్ రెడ్డి టికెట్టు కోసం కసరత్తు చేశారు. అధిష్టానంపై ఆయన భరోసా పెట్టుకున్నారు. టికెట్ ఎట్టి పరిస్థితుల్లో 100% తనకే వస్తుందని సంకేతాలను ప్రజలకు పార్టీకి చేరవేశారు. అయినప్పటికీ అధినాయకుడు మాత్రం అంజయ్యకి పూర్తి ఆశీస్సులు అందజేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం దక్కించుకున్న నాయకుడిగా అంజయ్య యాదవ్ ముందుకు సాగుతున్నారు. ఇదేమాదిరిగా గతంలో కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి డాక్టర్ పి.శంకర్రావు ఈ నియోజక వర్గంలో తనదైన శైలిలో చెరగని ముద్ర వేశారు. ఇప్పుడు అంజయ్య యాదవ్ కూడా ఆయన రికార్డును బ్రేక్ చేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంజన్నను టికెట్ వరించినందుకు అంజన్నకు అంజన్నే సాటి అంటున్నారు అభిమానులు.

షాద్‌నగర్‌ నియోజకవర్గ విషయానికి వస్తే..

షాద్‌నగర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసిన సిటింగ్‌ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్‌ రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే సి.ప్రతాప్‌ రెడ్డిపై 20556 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. అంజయ్యకు 72180 ఓట్లు రాగా, ప్రతాపరెడ్డికి 51624 ఓట్లు వచ్చాయి. వరుసగా రెండోసారి గెలిచిన అంజయ్య యాదవ్‌ సామాజికపరంగా యాదవ వర్గానికి చెందినవారు. ఇక్కడ బీఎస్పీ తరపున పోటీ చేసిన వీర్లపల్లి శంకర్‌కు 27,750 ఓట్లు రావడం విశేషం. నియోజక వర్గాల పునర్విభజన తర్వాత జనరల్‌ సీటుగా మారిన షాద్‌నగర్‌ నుంచి 2009లో కాంగ్రెస్‌ ఐ అభ్యర్ధి ప్రతాప్‌రెడ్డి పోటీచేసి గెలుపొందినా, 2014లో ఓడిపోయారు. తిరిగి గత 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నేత అంజయ్యయాదవ్‌ తన సమీప ప్రత్యర్ధి ప్రతాపరెడ్డిని 17,328 మెజార్టీతో ఓడించారు.

- Advertisement -

నియోజకవర్గంలో అంతకన్నా ముందు..

హైదరాబాద్‌లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేరళ మాజీ గవర్నర్‌ బూర్గుల రామకృష్ణారావు 1952లో గెలుపొందారు. 1952 నుంచి 1962 వరకు జనరల్‌గా ఉన్న ఈ నియోజకవర్గం 1967 నుంచి 2004 వరకు రిజర్వుడ్‌ నియోజకవర్గంగా ఉండేది. తిరిగి 2009లో జనరల్‌ స్థానంగా మారింది. కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి 11సార్లు, టిడిపి రెండుసార్లు, టీఆర్‌ఎస్‌ రెండుసార్లు గెలిచాయి. షాద్‌నగర్‌లో అత్యధికంగా డాక్టర్‌ పి. శంకరరావు నాలుగుసార్లు గెలిచారు. ఈయన 2009లో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో పోటీచేసి ఐదోసారి గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన కె.నాగన్న ఇతర చోట్ల మరో మూడుసార్లు విజయం సాధించారు. ఇక్కడ నుండి 1957లో గెలుపొందిన షాజహాన్‌ బేగం అంతకుముందు పరిగిలో ఏకగ్రీవంగా గెలవడం విశేషం.
షాద్‌ నగర్‌ జనరల్‌ గా ఉన్నప్పుడు రెండుసార్లు రెడ్డి, రెండుసార్లు బిసి, ఒకసారి ముస్లిం నేతలు ఎన్నికయ్యారు. ఇక్కడ గెలిచిన శంకరరావు గతంలో విజయబాస్కరరెడ్డి క్యాబినెట్‌ లోను ఆ తర్వాత కిరణ్‌ క్యాబినెట్‌లోను మంత్రి అయ్యారు. కానీ కిరణ్‌తో వచ్చిన విబేధాల కారణంగా పదవి పోగొట్టుకున్నారు. కాగా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌ ఆస్తులపై శంకరరావు హైకోర్టుకు లేఖ రాయడం, ఆ తర్వాత కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడం, జగన్‌ ను అరెస్టు చేయడం వంటి కీలక ఘట్టాలకు శంకరరావు పాత్రధారి అవడం విశేషం. షాద్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట.. ఈ కంచుకోటను బద్దలు కొట్టిన పార్టీ గులాబీ దళం.

Advertisement

తాజా వార్తలు

Advertisement