Friday, April 26, 2024

గ్రంథాలయ సంస్థ నియామకంతో ఆశలు

వికారాబాద్‌ : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా మురళీకృష్ణగౌడ్‌ను ప్రభుత్వం నియమించడంతో నామినేటెడ్‌ పదవుల కొరకు ఎదురుచూస్తున్న టిఆర్‌ఎస్‌ నేతలలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. నామినేటెడ్‌ పదవుల కొరకు జిల్లాలో అనేక మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చాలా కాలంగా నియమిత పదవులను పంపిణీ చేయకపోవడంతో పెద్ద సంఖ్యలో నేతలు వాటి కొరకు ఎదురుచూస్తున్నారు. కొందరు జిల్లా స్థాయి పోస్టులు కొరకు వేచి ఉండగా మరికొందరు రాష్ట్ర స్థాయిలో పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. మొత్తంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నియామకంతో తమకూ నామినేటెడ్‌ పదవులను ఇప్పించాలని స్థానిక ఎమ్మెల్యేలపై వత్తిడి ప్రారంభమైంది.

టిఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయ్యింది. గత డిసెంబర్‌ నాటికి రెండేళ్లు పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలో అడుగు పెట్టింది. టిఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు.. లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. గత ఏడాది కాలం మొత్తం కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇలా మొదటి రెండేళ్లు గడిచిపోయింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి రెండో దశకు చేరుకున్నా పరిస్థితి మాత్రం గత ఏడాది మాదిరిగా లేదు. ప్రభుత్వం అన్ని రకాల నిర్ణయాలను తీసుకుంటోంది. దీంతో సాధారణ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎన్ని రకాల ఎన్నికలు గడిచిపోయాయి. మిగిలింది 2023లో అసెంబ్లిd ఎన్నికలు. అప్పటి వరకు ఎలాంటి ఎన్నికలు లేవు. ఇదే విషయాన్ని ఇటీవల తనను కలిసి తాండూరు నియోజకవర్గ నేతలతో టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. పార్టీలో ఎవరు కూడా గ్రూపు రాజకీయాలు చేయకుండా అందరూ కలిసి ముందుకు సాగాలని కేటీఆర్‌ సూచించారు.

నియమిత పదవుల కొరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కొందరు నేతలు అయితే టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి నియమిత పదవుల కొరకు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నేతలు ఎప్పటికప్పుడు గులాబి పెద్దలను కలిసి నియమిత పదవుల విషయాన్ని గుర్తుచేస్తున్నారు. తాజాగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా తాండూరుకు చెందిన మురళీకృష్ణను నియమించడంతో అందరిలో ఆశలు రెట్టింపు అయ్యాయి. తమకూ నామినేటెడ్‌ పదవులు ఇప్పించాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌, పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి, కోడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిలపై వత్తిడి పెరుగుతోంది. తాండూరుకు చెందిన టిఆర్‌ఎస్‌ నేతలు తమకు నియమిత పదవులు ఇప్పించాలని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిపై వత్తిడి తీసుకవస్తున్నారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల తరువాత పెద్ద ఎత్తున నామినేటెడ్‌ పదవుల పంపిణీ ఉంటుందని టిఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు తమ అనుచరులకు సంకేతాలు ఇస్తున్నారు.

గతంలో నియమిత పదవుల కొరకు అడిగితే..జిల్లాలో ఎవరికైనా ఒకరికి ఇస్తే మీకూ ఇప్పిస్తానని ముఖ్యనేతలు చెప్పిన మాటలను టిఆర్‌ఎస్‌ నేతలు గుర్తుచేస్తున్నారు. మురళీకృష్ణకు ఇచ్చారు..తమకూ ఇప్పించాలని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. నేతల వత్తిడితో కొందరు ముఖ్యనేతల నుంచి సమాధానం ఉండడం లేదు. తాండూరు నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి తన ముఖ్యఅనుచరుడు, టిఆర్‌ఎస్‌ వ్యూహకర్త మురళీకృష్ణకు నియమిత పదవిని చెప్పి మరీ ఇప్పించుకొని పైచేయి సాధించారని.. తమకూ ఇప్పించాలని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిపై ఆయన వర్గంకు చెందిన నేతలు వత్తిడి తీసుకవస్తున్నారు. తాండూరులో ఇదే దూకుడు కొనసాగించేందుకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో దేవాలయాల కమిటిలను నియమించాలని ఆతరువాత పార్టీ పదవులను పంపిణీ చేయాలని యోచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement